ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్‌ నిపుణులు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్‌ నిపుణులు

Published Sat, Feb 6 2021 4:24 AM

Centre To Induct More Private Sector Specialists As Department Directors - Sakshi

న్యూఢిల్లీ: అధికార యంత్రాంగానికి కొత్త రక్తం ఎక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుడుగు వేస్తోంది. కీలకమైన శాఖల్లో 30 మంది ప్రైవేట్‌ రంగ నిపుణులను కాంట్రాక్టు విధానంలో నియమించాలని నిర్ణయించింది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే జాయింట్‌ సెక్రెటరీ, డైరెక్టర్‌ పోస్టుల్లో వీరిని నియమించాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ పోస్టుల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా ఎంపికైన వారిని నియమిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3 జాయింట్‌ సెక్రెటరీ, 27 డైరెక్టర్ల పోస్టుల భర్తీకి గాను నైపుణ్యం కలిగిన భారతీయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ యూపీఎస్సీ ఇటీవల ప్రకటనలు జారీ చేసింది.

వాణిజ్య, పరిశ్రమల శాఖ, రెవెన్యూ విభాగం, ఆర్థిక శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో జాయింట్‌ సెక్రెటరీ పోస్టులో ప్రైవేట్‌ నిపుణులను నియమిస్తారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, న్యాయ శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ, జలశక్తి శాఖ, పౌర విమానయాన తదితర శాఖల్లో డైరెక్టర్‌ పోస్టుల్లో ప్రైవేట్‌ నిపుణులను చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాయింట్‌ సెక్రెటరీ స్థాయి పోస్టులో కనీసం 15 ఏళ్ల అనుభవం, డైరెక్టర్‌ స్థాయి పోస్టులో పదేళ్ల అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. 

Advertisement
Advertisement