పాపం ఈ కుర్రాళ్లు .. పుట్టుకతో వృద్ధులు | Sakshi
Sakshi News home page

పాపం ఈ కుర్రాళ్లు .. పుట్టుకతో వృద్ధులు

Published Sat, Jul 23 2022 8:08 PM

Chennai: Govt Officer Removes Old Age Pensions Fake Beneficiaries - Sakshi

చెన్నై: సహజంగా అందరూ వృద్ధాప్యంలోనూ యవ్వనవంతులుగా ఉండాలని కోరుకుంటారు. అయితే తమిళనాడులో కొందరు యవ్వనంలోనే సీనియర్‌ సిటిజన్స్‌గా ప్రచారంగా చేసుకుంటూ “కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’అనే శ్రీశ్రీ రాసిన కవితను తలపిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి వృద్ధ్యాప్య పింఛను స్వాహా చేస్తున్న చెన్నై, కాంచీపురం జిల్లాలకు చెందిన 4,191 మంది పట్టుబడ్డారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో వృద్ధ్యాప్య పింఛను కూడా ఒకటి. బంధువుల ఆసరా లేకుండా, సొంతిల్లు, రెండు వంట గ్యాస్‌ సిలిండర్ల కనెక్షన్, బ్యాంకులో రూ.1 లక్షకు మించని నగదు, 5 సవర్లకు మించని బంగారు నగలు తదితర నిబంధనలకు లోబడి జీవించే 60 ఏళ్లు పైబడిన వారు వృద్ధ్యాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికేట్లు తనిఖీ చేసిన తరువాత అర్హత ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలకు రూ.1000 పింఛను మంజూరు చేస్తారు.  

అవకతవకలపై ఫిర్యాదులు 
పెన్షన్‌ మంజూరులో రాష్ట్రవ్యాప్తంగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కాంచీపురం జిల్లాలో 60,500 మంది పింఛను పొందుతున్నారు. వీరిలో కొందరు మంచి వసతులతో కూడిన జీవిస్తున్నా తప్పుడు పత్రాలను సమర్పించి పెన్షన్‌ పొందుతున్నట్లు అనుమానాలు తలెత్తడంతో అధికారుల బృందం విచారణ ప్రారంభించింది. ఆయా తాలూకాల, గ్రామ నిర్వాహకుల కార్యాలయాలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల సాయంతో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించింది. ఒక్క కాంచీపురం జిల్లాల్లోనే 4,180 మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దీంతో వారందరిని వృద్ధ్యాప్య పింఛనుకు అనర్హులుగా ప్రకటించి లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. ఇక చెన్నై జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పథకం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు 1.95 లక్షల మంది పింఛన్‌ పొందుతున్నారు. వీరిలో కొందరు నకిలీ లబ్ధిదారులని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. 11 వేల బోగస్‌ పింఛనుదారులను జాబితా నుంచి తొలగించారు. రెండు జిల్లాల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ లబ్ధిదారులు పట్టుబడటంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చదవండి: చెన్నైలోని ఐసీఎఫ్‌.. ప్రపంచ దేశాల్లో ఈ పేరు మారుమోగుతోంది.. ఎందుకో తెలుసా!

Advertisement
Advertisement