Sakshi News home page

సుప్రీంకోర్టులో సింగిల్‌ మాల్ట్‌ ఎపిసోడ్‌

Published Thu, Apr 4 2024 5:55 AM

CJI DY Chandrachud, senior advocate Dinesh Dwivedi funny scene - Sakshi

నవ్వులు పూయించిన మద్యం సంగతులు

న్యాయవాది ద్వివేదిపై సీజేఐ చెణుకులు

మద్యం కేసు విచారణలో సరదా చర్చ

న్యూఢిల్లీ: సంక్లిష్టమైన కేసులపై సీరియస్‌గా విచారణ జరిగే సుప్రీంకోర్టులో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విస్కీ, దాని రకాలు తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, సీనియర్‌ న్యాయవాది దినేశ్‌ ద్వివేది మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ నవ్వులు పూయించింది. సీజేఐ హాస్య చతురత అందరినీ అలరించింది. పారిశ్రామిక ఆల్కహాల్‌ ఉత్పత్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సంబంధించిన వివాదంపై సీజేఐ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు జరిగిన విచారణ ఇందుకు వేదికైంది.

ఈ కేసులో యూపీ తరఫున వాదిస్తున్న ద్వివేది తెల్ల జుట్టు రంగులమయంగా కని్పంచడంపై జస్టిస్‌ చంద్రచూడ్‌ సరదాగా ఆరా తీశారు. హోలీ సంబరాలు కాస్త శ్రుతి మించడమే కారణమంటూ ద్వివేది కూడా అంతే సరదాగా బదులిచ్చారు. ‘‘ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించాలి. నా మనవల నిర్వాకం కూడా ఇందుకు కొంతవరకు కారణమే. సంతానం, మనవలు మరీ ఎక్కువగా ఉంటే, అందులోనూ వారంతా మనతో పాటే ఉంటుంటే  ఇలాంటి గమ్మత్తైన సమస్యలుంటాయి. తప్పించుకోలేం’’ అన్నారు. సీజేఐ అంతటితో వదల్లేదు. ‘అంతేగానీ, ఆల్కహాల్‌కు ఏ సంబంధమూ లేదంటారు!’ అంటూ చెణుకులు విసిరారు.

విస్కీప్రియుడైన ద్వివేది అందుకు చిరునవ్వులు చిందించారు. ‘‘విస్కీ పాత్ర కూడా ఉందని నేను ఒప్పుకుని తీరాలి. హోలీ అంటేనే ఆల్కహాల్‌ పారీ్టలు. పైగా నేను విస్కీకి వీరాభిమానిని’’ అనడంతో అంతా గొల్లుమన్నారు. సింగిల్‌ మాల్ట్‌ విస్కీ విషయంలో ఇంగ్లండ్‌లో తనకెదురైన గమ్మత్తైన అనుభవాన్ని విచారణ సందర్భంగా ద్వివేది ఏకరువు పెట్టారు. ‘‘నేను సింగిల్‌ మాల్ట్‌ విస్కీనే ఇష్టపడతా. ఆ విస్కీకి స్వర్గధామంగా చెప్పదగ్గ ఎడింబర్గ్‌ వెళ్లానోసారి. సింగిల్‌ మాల్ట్‌ తెప్పించుకుని ఐస్‌క్యూబ్స్‌ వేసుకోబోతుంటే వెయిటర్‌ అడ్డుకున్నాడు.

‘ఇదేం పని! అది సింగిల్‌ మాల్ట్‌ విస్కీ. దాన్నలాగే నేరుగా ఆస్వాదించాలి. అంతేతప్ప ఇలా ఐస్‌క్యూబులూ సోడాలూ కలపొద్దు! పైగా దానికంటూ ప్రత్యేకమైన గ్లాస్‌ ఉంటుంది. అందులో మాత్రమే తాగాలి’ అంటూ సుదీర్ఘంగా క్లాస్‌ తీసుకున్నాడు. సింగిల్‌ మాల్ట్‌ తాగేందుకు ఇంత తతంగం ఉంటుందని అప్పుడే నాకు తెలిసొచి్చంది’’ అంటూ వాపోయారు. దాంతో న్యాయమూర్తులతో పాటు కోర్టు హాల్లో ఉన్నవాళ్లంతా పడీపడీ నవ్వారు. ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులు కూడా తమ చెణుకులతో ఈ సరదా సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించారు.

పారిశ్రామిక ఆల్కహాల్‌తో పాటు విస్కీ, వోడ్కా వంటివి కూడా రాష్ట్రాల నియంత్రణ పరిధిలోకే వస్తాయంటూ ద్వివేది వాదించడంతో ఒక న్యాయమూర్తి కలి్పంచుకున్నారు. ‘‘ఇంతకీ మీరనేదేమిటి? ఆల్కహాల్‌ మందుబాబులకు కిక్కిచి్చనా, ఇవ్వకపోయినా రాష్ట్రాల ఖజానాకు మాత్రం కిక్కివ్వాల్సిందేనంటారా?’’ అనడంతో నవ్వులు విరిశాయి. ఇంకో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘‘కొన్ని రకాల మద్యం రుచి కాలం గడిచేకొద్దీ పెరుగుతుందని, కొన్ని తేలిక రంగులోనూ మరికొన్ని ముదురు రంగులోనూ ఉంటాయని... ఇలా ఆల్కహాల్‌కు సంబంధించిన చాలా అంశాలను మీరు ఎంతో చక్కగా వివరించారు. సాక్ష్యంగా ఆయా రకాల మద్యం బాటిళ్లను ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు!’’ అనడంతో కోర్టు హాలంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement