కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు.. ఎన్నికల వేళ ఖర్గే ఆవేదన ఇదే..  | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు.. ఎన్నికల వేళ ఖర్గే ఆవేదన ఇదే.. 

Published Thu, Mar 14 2024 8:00 AM

Congress Chief Mallikarjun Kharge We Dont Have Money To Spend Elections - Sakshi

బెంగళూరు: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఎన్నిక ఏదైనా దాదాపు ఓటమే కాంగ్రెస్‌కు ఎదరువుతోంది. స్థానిక పార్టీలు, బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ చతికిలపడుతోంది. ఇలాంటి సమయంలో.. కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక పరిస్థితిపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇక, తాజాగా మల్లికార్జున్‌ ఖర్గే ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందని, ఆదాయం పన్ను శాఖ తమ పార్టీపై భారీ జరిమానాలను విధించిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీనీ, బీజేపీని తీవ్రంగా విమర్శించారు.  

ఇదే సమయంలో దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు రానున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలలో ప్రతీ రాజకీయ పార్టీకి సమాన అవకాశాలు ఉండాలని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్నికల బాండ్ల ద్వారా వేల కోట్లను విరాళాల రూపంలో పుచ్చుకున్న బీజేపీ వాటి వివరాలను మాత్రం వెల్లడించడానికి సిద్ధంగా లేదని ఖర్గే విమర్శించారు. తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ద్వారా స్తంభింపచేసి భారీ జరిమానాలను విధించిందని ఆయన ఆరోపించారు. 

ప్రజలు విరాళంగా ఇచ్చిన తమ పార్టీ నిధులను బీజేపీ ప్రభుత్వం స్తంభింపచేసిందన్నారు. అలాగే, ప్రస్తుతం ఖర్చు చేయడానికి తమ వద్ద నిధులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ తప్పుడు పనులు బయటపడతాయన్న భయంతోనే ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి జూలై వరకు సమయం కోరుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.

మరోవైపు.. గుజరాత్‌లో క్రికెట్‌ స్టేడియంకు మోదీ పేరు పెట్టడంపై ఖర్గే సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఎవరైనా మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థం వారి పేర్లను పెడతారని, కాని ఒక మనిషి బతికున్నపుడే తన పేర్లను వేటికీ పెట్టుకోడని అన్నారు. అలాగే, బీజేపీ నేతలను మోసగాళ్లుగా అభివర్ణించిన ఖర్గే మోసగాళ్ల చేతిలో మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అంబేద్కర్ చెప్పారని, రాజ్యాంగమే లేకపోతే దేశంలో స్వేచ్ఛ, ఐక్యత ఎక్కడ ఉంటాయని ఆయన ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement