ఆ రాష్ట్రంలో33,000 మంది పిల్లలకు కరోనా!

8 Sep, 2020 08:48 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ (కోవిడ్‌–19)కు మహారాష్ట్ర కేంద్రంగా మారుతోంది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 42 లక్షలు దాటగా ఒక్క మహారాష్ట్రలోనే 9 లక్షలు దాటడం గమనార్హం. మరోవైపు మృతుల సం ఖ్యను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి సుమారు 70 వేలమంది మరణించగా మహారాష్ట్రలో మృతుల సంఖ్య 27 వేలకు చేరువైంది. రాష్ట్రంలో జూలై ఆఖరి వరకు పరి స్థితి కొంత మెరుగుపడుతుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కరోనా తీవ్రత పెరగడం కలకలం సృష్టిస్తోంది. గత వారం పది రోజులుగా కేసుల స్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా వరుసగా ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య 20 వేలు దాతుతోంది. 

33 వేలమంది పిల్లలకు కరోనా.. 
రాష్ట్రంలో కొన్ని రోజులుగా మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా పిల్లలను కూడా వదలడం లేదు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు నవజాత శిశువుల నుంచి 10 ఏళ్లలోపు 33 వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో సుమారు నాలుగు శాతం. మరోవైపు 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసున్న కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో ఏడు శాతానికి పైగా ఉంది. కరోనా బాధితుల సంఖ్య ఓ వైపు పెరుగుతుండగా రికవరి రేటు కూడా గణనీయంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 72 శాతం దాటింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.  

ముంబైలో 1.55 లక్షలకు చేరిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు తొమ్మిది లక్షలు దాటగా వీటిలో ఒక్క ముంబైలోనే 1.55 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత డేంజర్‌ జోన్‌గా ఉంది. అసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారావిలో కరోనా నియంత్రణకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం కాగా మరోవైపు ముంబైలో కూడా నిలకడగా కనబడింది. అయితే గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసుల సంఖ్య 17 వేల నుంచి 19 వేలు దాటుతోంది. దీంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ముంబైలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య సెప్టెంబరు 6వతేదీ నాటికి 1,55,622 కాగా యాక్టీవ్‌ కేసుల సంఖ్య 23,939 ఉంది. మరోవైపు మరణాల సంఖ్య 7,869కి చేరింది.  

ప్రపంచంలోనే 5వ స్థానంలో! 
మహారాష్ట్ర ఒక దేశంగా భావించినట్టయితే ప్రపంచంలోనే అయిదవ స్థానంలో ఉండేది. అత్యధిక కేసులతో ముందుండే చైనా, కెనడా, ఇటలీ, జర్మనీ తదితరాలను మహారాష్ట్ర ఎప్పుడో అధిగమించింది. తాజాగా ప్రస్తుతం అమెరికా అనంతరం 2వ స్థానంలో ఇండియా ఉండగా బ్రెజిల్‌ 3వ స్థానంలో, రష్యా 4వ స్థానంలో 10.30 లక్షల కరోనా కేసులతో ఉంది. అయితే 5వ స్థానంలో ఉన్న పేరు దేశంలో కేవలం 6.89 లక్షల కేసులుండగా ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసులు తొమ్మిది లక్షలకుపైగా నమోదయ్యాయి. 

థానే పోలీసు కమిషనర్‌కు కరోనా 
థానే పోలీసు కమిషనర్‌ వివేక్‌ ఫన్సల్కర్‌కు కరోనా సోకింది. లాక్‌డౌన్‌ సమయంలో కోవిడ్‌ సోకిన థానే పోలీసులను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న పోలీసు కమిషనర్‌కు స్వయంగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నాలుగైదు నెలలుగా కొనసాగిన లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు రాత్రింబవళ్లు కరోనాను నియంత్రించేందుకు తీవ్రంగా కృషి చేశారు.

ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపై తిరిగేవారిపై చర్యలు చేపట్టడంతోపాటు వలస కార్మికులను వారి వారి స్వగ్రామాలకు తరలించేందుకు తమ వంతు కృషి చేశారు. ఇలా ఎంతో ధైర్యంగా విధులు నిర్వహించిన పలువురు పోలీసులకు కరోనా సోకింది. అయితే వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుని వారి పై అధికారిగా అండగా నిలిచిన వివేక్‌ ఫన్సల్కర్‌కూ కరోనా సోకింది. దీంతో ఆదివారం రాత్రి ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు థానేలో 129 పోలీసు అధికారులు, 1,176 మంది పోలీసు సిబ్బంది ఇలా మొత్తం 1,305 మందికి కరోనా సోకింది. వీరిలో 1,664 మంది కరోనాను జయించి విముక్తి పొందారు. అయితే 18 మంది పోలీసులు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా 141 మంది వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

చదవండి: రెండో స్థానంలోకి భారత్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు