కరోనా మారణకాండ.. నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌  | Sakshi
Sakshi News home page

కరోనా మారణకాండ.. నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ 

Published Tue, Apr 20 2021 8:10 AM

Covid 19 Karnataka CM To Hold All Party Virtual Meet From Hospital - Sakshi

సాక్షి, బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దాడి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కాటుకు గడిచిన 24 గంటల్లో 146 మంది చనిపోయారు. మరో 15,785 పాజిటివ్‌లు, 7,098 డిశ్చార్జిలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,76,850కు పెరిగింది. అందులో 10,21,250 మంది కోలుకున్నారు. మరో 13,497 మంది మరణించారు. ప్రస్తుతం 1,42,084 కేసులు యాక్టివ్‌ కేసులుండగా అందులో 721 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈసారి మరణాలు హఠాత్తుగా పెరగడం గమనార్హం.  

బెంగళూరులో 9,618 కేసులు..  
బెంగళూరులో తాజాగా 9,618 పాజిటివ్‌లు, 4,240 డిశ్చార్జిలు, 97 మరణాలు సంభవించాయి. నగరంలో ఇప్పటివరకు 5,220 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. ప్రస్తుతం 1,03,178 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా భయానికి తోడు కఠినమైన ఆంక్షల వల్ల బెంగళూరు నుంచి వేలాది మంది స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. కోరమంగళలోని ఇండోర్‌స్టేడియాన్ని కోవిడ్‌ సెంటర్‌గా మార్చుతున్నారు. అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనేది చెప్పడం లేదు.   

మరణాలు ఎక్కడ ఎన్ని..  
బెంగళూరులో 97, హాసన్‌లో 11, మైసూరులో 8, బెంగళూరు రూరల్‌లో 6, కలబురిగిలో 6, ధారవాడలో 3, బీదర్, చిక్కబళ్లాపుర, యాదగిరిలో రెండు చొప్పున, బళ్లారి, బెళగావి, హావేరి, కొడగు, కోలారు, రామనగర, తుమకూరు, ఉత్తర కన్నడ, విజయపురలో ఒక్కో మరణం నమోదైంది.  

84,785 మందికి టీకా..  

  • రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 1,23,212 శాంపిళ్లు పరీక్షించారు. ఇప్పటి వరకు టెస్టులు 2,37,16,866 అయ్యాయి.  
  • కొత్తగా 84,785 మందికి కరోనా టీకా వేశారు. దీంతో మొత్తం టీకాల సంఖ్య 71,17,405 కు పెరిగింది.  

నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ 
యశవంతపుర: రాష్ట్రంలో కరోనా నియంత్రణపై చర్చించడానికి నేడు మంగళవారం ప్రతిపక్ష పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎం బీఎస్‌ యడియూరప్ప నిర్ణయించారు. సీఎంకు కరోనా సోకడంతో ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం తెలిసిందే. అక్కడి నుంచే సాయంత్రం 4:30 గంటలకు కాన్ఫరెన్స్‌ జరుగుతుంది. ఇందులో పాల్గొనాలని ప్రతిపక్ష నేతలకు సీఎంఓ సమాచారం పంపింది. కాగా గవర్నర్‌ వజూభాయ్‌ ఆర్‌ వాలా ఈ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నట్లు సమాచారం. ఈ మంగళవారం నాటి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం యడియూరప్ప, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమారస్వామి, డీకే శివకుమార్‌ తదితరులు పాల్గొననున్నారు.

బెడ్స్‌ కొరత వాస్తవమే 
యశవంతపుర: బెంగళూరు నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరగటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. సోమవారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడుతూ... బెంగళూరులో లాక్‌డౌన్‌ ప్రచారం జరుగుతోందని, అయితే లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారంకాదని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు మునిరత్న, గరుడాచార్‌ మాట్లాడుతూ చిక్కపేట పరిధిలో కరోనా కేసులు అధికమయ్యాయి. బెడ్ల కొరత కారణంగా రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా లాక్‌డౌన్‌ విధించాలని కోరారు.  

ప్రజలు సహకరించాలి: బొమ్మై 
బనశంకరి: ప్రజల సహకారం లేకపోతే ప్రభుత్వం ఎన్ని చట్టాలు అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ ప్రయోజనం లేదని హోంశాఖామంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. సోమవారం నగరంలో మాట్లాడుతూ కోవిడ్‌ పెచ్చుమీరుతున్నందున ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనల్ని పాటించాలని కోరారు. 144 సెక్షన్, లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటివి ప్రజలే విధించుకోవాలన్నారు. బెంగళూరులో కరోనా కట్టడికి ఎలాంటి చట్టాలను అమలు చేయాలనేదానిపై ఇప్పటికే నగర కమిషనర్‌తో చర్చించామన్నారు. పరిస్థితిని ఎదుర్కొనే  శక్తి తమ పోలీసులకు ఉందని తెలిపారు.

ఐసీయూలో సర్కారు: సిద్ధు..  
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. సీఎం యడియూరప్ప కరోనా బారిన పడి ఆస్పత్రిలో ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం ఐసీయూలో ఉందని ట్వీట్‌ చేశారు. కరోనా మరణాలు క్రమంగా పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. కాగా, కరోనా నియంత్రణలో భాగంగా మసీదులు మూసి వేయవద్దని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే జమీర్‌అహ్మద్, ఎమ్మెల్యే రిజ్వాన్‌ విన్నవించారు. 

చదవండి: బెంగళూరులో రాత్రి కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌కు సీఎం ససేమిరా  

Advertisement
Advertisement