Covid 19 New Variant Omicron Concern States Issue Rules In India - Sakshi
Sakshi News home page

భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రకంపనలు.. అప్రమత్తమైన రాష్ట్రాలు

Published Sun, Nov 28 2021 12:21 PM

Covid 19 New Variant Omicron Concern States Issue Rules In India - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ మన దేశంలోకి విస్తరించి, మరో వేవ్​కు దారి తీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఒమిక్రాన్​ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి.

మహారాష్ట్రలో..
విదేశాల నుంచి మహారాష్ట్రలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ వేయించుకోవాలని లేదా 72 గంటల ముందు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉండాలని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అప్రమత్తమైన దేశ రాజధాని
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ అనిల్ బైజాల్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకూండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టాలని.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన దేశాల నుంచి భారత్‌కు విమానాలను నిలిపివేయాలని ప్రధానికి కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు.
(చదవండి: ఎన్టీఆర్‌ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు)

విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు
విదేశీ ప్రయాణికుల విషయంలో గుజరాత్ ప్రభుత్వం కొత్త ఆంక్షలను ప్రకటించింది. యూరప్‌, బ్రిటన్​, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ , బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ నుంచి గుజరాత్​లోకి వచ్చేవారు పూర్తి స్థాయి కరోనా టీకా తీసుకోనట్లైతే.. విమానాశ్రయాల్లో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. పూర్తి స్థాయి టీకా తీసుకున్నవారికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేసి, ఎలాంటి లక్షణాలు లేకపోతేనే.. రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పింది.

ఆర్​టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం ఉంటేనే కర్ణాటకలోకి
కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్​టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం చూపిస్తేనే తమ రాష్ట్రంలోకి అనుమితిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 16 రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన విద్యార్థులు.. మరోసారి ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్​లో పని చేసే వారంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై తెలిపారు. 

విమానాశ్రయాల్లో నిఘా పెంచాం: కేరళ
విదేశాల్లో కరోనా కొత్త వేరియంట్​ వ్యాప్తి దృష్ట్యా కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా పెంచామని చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, అందరూ టీకా తీసుకోవాలని ఆమె కోరారు.

చదవండి: కోవిడ్‌ ‘ఒమిక్రాన్‌’ వేరియెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కలవరం

Advertisement
Advertisement