కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి డ్రోన్లు 

14 Jun, 2021 09:03 IST|Sakshi

మారుమూల ప్రాంతాలకు ఇక వ్యాక్సినేషన్‌ ∙బిడ్లను ఆహ్వానించిన కేంద్రం  

న్యూఢిల్లీ: దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. డ్రోన్ల సాయంతో టీకా డోసుల్ని పంపించాలని నిర్ణయించిన కేంద్రం దీనికి సంబంధించి బిడ్లను కూడా ఆహ్వానించింది. డ్రోన్ల సాయంతో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను పంపించడానికి గల సాధ్యాసాధ్యాలపై ఐఐటీ కాన్పూర్‌ సహకారంతో కేంద్రం ఇప్పటికే అధ్యయనం నిర్వహించింది. అన్‌మాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌ (యూఏవీ.. డ్రోన్లు)తో టీకా డోసులు పంపించడానికి వీలవుతుందని ఆ అధ్యయనంలో తేలింది. 

ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ రీసెర్చ్‌ మెడికల్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఎంఆర్‌) తరఫున హెచ్‌ఎల్‌ఎల్‌ ఇన్‌ఫ్రా టెక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ డ్రోన్ల సాయంతో టీకా డోసుల్ని పంపించడానికి ఆసక్తి కలిగిన కంపెనీలు జూన్‌ 22లోగా తమ బిడ్లను దాఖలు చేయాలని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రోన్లకు నాలుగు కేజీల బరువుని మోసే సామర్థ్యం ఉండాలని, 100 మీటర్ల ఎత్తులో 35 కి.మీ. వరకు ప్రయాణించి, తిరిగి వెనక్కి రాగలిగేలా ఉండాలని హెచ్‌ఎల్‌ఎల్‌ స్పష్టం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సవాల్‌గా మారింది. ఇప్పటివరకు దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ తరహా ఆలోచన చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ సహకారంతో డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు టీకా డోసుల్ని పంపించేలా ఆరు రోజుల పైలెట్‌ ప్రాజెక్టుని కూడా నిర్వహించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పుడే కేంద్రమే ముందుకు రావడంతో త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్‌ అందనుంది.   

మరిన్ని వార్తలు