లిక్కర్‌ స్కాం: కవిత సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్ | Delhi Liquor Scam Case: BRS MLC Kavitha CBI Arrest Updates - Sakshi
Sakshi News home page

MLC Kavitha CBI Arrest Updates: లిక్కర్‌ స్కాం: కవిత సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్

Published Fri, Apr 12 2024 7:33 AM

Delhi Liquor Scam Case: Brs Mlc Kavitha Cbi Arrest Updates - Sakshi

కవిత విచారణకు సహకరించడం లేదు: సీబీఐ

లిక్కర్‌ కేసులో కవిత వాస్తవాలు దాచారు

బిఐ స్పెషల్ జడ్జి ముందు కవితని ప్రవేశపెట్టిన సిబిఐ

అయిదు రోజుల కస్టడీ కోరిన సీబీఐ

సాక్షి, ఢిల్లీ: కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ 2 గంటలకు వాయిదా వేసింది కోర్టు. అయితే తనను కస్టడీకి ఇవ్వొద్దని, ఇప్పటికే సిబిఐ తనను ప్రశ్నించిందని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ సీబీఐ అడుగుతోందని కవిత తెలిపారు. సీబీఐది వృథా ప్రయాస అని, చెప్పడానికి ఏమీ లేదని, సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు తీహార్ జైలు నుంచి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు కవిత చేరుకున్నారు. జడ్జి ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టింది. ఐదు రోజుల కస్టడీ సీబీఐ కోరింది. కవితను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు సీబీఐ తెలిపింది. కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్‌ చేశారు. అరెస్టు, రిమాండ్ పై  వాదనలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వింటామని జడ్జి తెలిపారు. దీంతో కవితని కోర్టు రూం నుంచి తీసుకెళ్లారు అధికారులు.

సీబీఐ వాదనలు:
ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు. అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161, 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ కేసులో కవిత నిజాలు దాచారు. మా వద్ద ఉన్న సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో దర్యాప్తునకు పిలిచినా హాజరుకాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టారు. ఇదంతా బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో బయటపడింది. మాగుంట రాఘవ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇండొ స్పిరిట్, పెర్నాన్ రిచార్డ్ ద్వారా అక్రమ లాభాలు. ట్రైడెంట్ ద్వారా మహిర వెంచర్ లో భూమి కొన్నట్టు జూలై, ఆగస్టు 2021 డబ్బు చెల్లింపులు చేశారు. అన్ని రికార్డులు వాట్సాప్ లో బయటపడ్డాయి. శరత్ చంద్ర రెడ్డి  కవిత బెదిరించారు

నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. సీబీఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా సీబిఐ అరెస్ట్ చేసిందని కవిత  తరపు న్యాయవాది పేర్కొన్నారు.

బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్‌పై సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేపట్టింది. సౌత్ గ్రూపునకు ఆప్‌కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది. 

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంది. తాజాగా తాము కవితను అరెస్టు చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు.

దీంతో కవిత అరెస్టును సవాల్‌ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది నితీష్‌ రాణా.. రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్‌ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌కుమార్‌ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు. దీనిని శుక్రవారం రెగ్యులర్‌ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్టు అన్యాయమని, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇదే విషయం శుక్రవారం రెగ్యులర్‌ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement