Sakshi News home page

పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 667 ర్యాంకు

Published Wed, May 24 2023 7:12 AM

Delhi Police Head Constable Ram Bhajan Kumar Got 667th Rank In Civils - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌భజన్‌ కుమార్‌ సివిల్స్‌లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్‌ సెల్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్‌ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్‌భజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్‌ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్‌భజన్‌కు తొమ్మిది సార్లు సివిల్స్‌ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. 

తాను రాజస్తాన్‌ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్‌ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్‌భజన్‌ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు.  

ఇది కూడా చదవండి: సివిల్స్‌లో నారీ భేరి 

Advertisement

తప్పక చదవండి

Advertisement