నేరస్థులను సన్మానించడం ముమ్మాటికీ తప్పే.. | Sakshi
Sakshi News home page

బిల్కిస్‌ బానో అత్యాచార కేసు దోషులను సన్మానించడం తప్పే..

Published Tue, Aug 23 2022 9:40 PM

Devendra Fadnavis On Bilkis Bano Case Convicts - Sakshi

ముంబై: బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. వారికి కొందరు పూలమాలలు వేసి సన్మానాలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దోషులు విడుదలయ్యారని, వారంతా దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు.

అయితే నేరస్థులకు పూలమాలలు వేసి సన్మానాలు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇలా చేయటం సరికాదన్నారు. మహారాష్ట్ర భండారాలో 35ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో ఘటనను సభలో ప్రస్తావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

2002 గుజరాత్ అలర్ల సమయంలో బాల్కిస్‌ బానో సామూహిక అత్యాచార ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని 2008లో దోషులుగా తేల్చింది ముంబయిలోని సీబీఐ న్యాయస్థానం. అందరికీ యవజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది.

అయితే 14 ఏళ్ల శిక్షకాలం పూర్తి చేసుకున్నందున తమను జైలు నుంచి విడుదల చేయాలని దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని గుజారత్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న 11 మందిని విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. వీరంతా జైలు నుంచి బయటకు రాగానే  కొందరు పూలమాలలు వేసి మిఠాయిలు తినిపించారు. దోషులందరినీ జైలు నుంచి విడుదల చేయడం, సన్మానించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే‌.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే!

Advertisement
Advertisement