ఢిల్లీలో ఆత్మహత్యాయత్నం.. అమెరికా నుంచి అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఆత్మహత్యాయత్నం.. అమెరికా నుంచి అలర్ట్‌

Published Sat, Jun 5 2021 7:08 PM

A Facebook Alert to Delhi Police Saved A Man From Committing Suicide - Sakshi

న్యూఢిల్లీ: భార్యను కోల్పోయి మానసికంగా కుంగిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. అతడి ప్రయత్నం గురించి వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో ఉన్న వారికి తెలిసింది. వారు ఢిల్లీ పోలీసులను అలర్ట్‌ చేయడంతో సదరు వ్యక్తి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోగలిగారు. ఆ వివరాలు.. దక్షిణ ఢిల్లీ ప్రాంతానికి చెందిన షోహన్‌ లాల్‌(పేరు మార్చారు) ఓ స్వీట్‌ షాప్‌లో పని చేస్తూ ఉండేవాడు. అతడికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల క్రితం షోహన్‌ లాల్‌ భార్య మరణించింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన షోహన్‌ లాల్‌ ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండేవాడు. 

ఈ  క్రమంలో రెండు రోజుల క్రితం పొరుగువారితో గొడవపడ్డాడు షోహన్‌ లాల్‌. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. ఈ చర్యలను అతడు ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయాలని భావించాడు. లైవ్‌ ఆన్‌ చేసి చేతి మీద కోసుకున్నాడు. ఈ తంతంగా అంతా అర్ధ రాత్రి 12 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. 

ఇక షోహన్‌ లాల్‌ ప్రయత్నాన్ని అమెరికాలోని ఫేస్‌బుక్‌ కార్యాలయంలోని అధికారులు గుర్తించారు. ఓ మేల్‌ ఫేస్‌బుక్‌ యూజర్‌ ఏదో అపాయకరమైన పని చేయబోతున్నాడని గుర్తించారు. వెంటనే దీని గురించి ఢిల్లీ పోలీసులను అలర్ట్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు నోడల్‌ సైబర్‌ యూనిక్‌కు చెందిన సైబర్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ అండ్ డిటెక్షన్ (సైపాడ్), సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ద్వారా ఫేస్‌బుక్‌ అధికారులు ఢిల్లీ పోలీసులను అలర్ట్‌ చేయగలిగారు. 

సైపాడ్‌ అధికారులు ఈ సమాచారాన్ని షోహన్‌ లాల్‌ ఇంటికి సమీపంలో ఉన్న అత్యవసర ప్రతిస్పందన వాహనం, దాని ఇన్‌ఛార్జి ప్రొబేషనర్‌ ఎస్పై అమిత్‌ కుమార్‌కు అందజేశారు. ఇక పోలీసు అధికారి వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లేసరికి అక్కడ షోహన్‌ లాల్‌ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికే చాలా రక్తం పోయింది. అమిత్‌ కుమార్‌ వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి.. ఆ తర్వాత ఏయిమ్స్‌ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం షోహన్‌ లాల్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలిపారు.

చదవండి: 2021లో భారీగా పెరిగిన ఫేస్‌బుక్‌ ఆదాయం 

Advertisement
Advertisement