Dilli Chalo 2.0: ఢిల్లీ సరిహద్దులో యుద్ధవాతావరణం | Farmers Begin 'Delhi Chalo' Protest, Police High Alert: Updates - Sakshi
Sakshi News home page

రైతన్నల ఢిల్లీ ఛలో.. ఢిల్లీ సరిహద్దులో యుద్ధవాతావరణం

Published Tue, Feb 13 2024 10:33 AM

Farmers begin their Delhi Chalo Delhi Police High Alert Updates - Sakshi

అష్ట దిగ్బంధనంలో దేశ రాజధాని ఢిల్లీ

  • సింగు బోర్డర్‌ వద్దకు భారీగా చేరుకున్న రైతులు
  • రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు
  • టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరనసన కారులు
  • శంభు బోర్డర్‌ వద్ద హైటెన్షన్‌
  • పోలీసులపై రాళ్లు రువ్విన రైతులు

#WATCH | Protesting farmers vandalise flyover safety barriers at the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/vPJZrFE0T0

— ANI (@ANI) February 13, 2024

పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత

  • బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన పోలీసులు
  • ఎక్కడిక్కడ రహదారులను మూసివేసిన పోలీసులు
  • పంజాబ్‌, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు
  • రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహిద్దుల్లో పటిష్ట భద్రత
  • కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతుల డిమాండ్‌

#WATCH | Protesting farmers throw police barricade down from the flyover at Shambhu on the Punjab-Haryana border as they march towards Delhi to press for their demands. pic.twitter.com/oI0ouWwlCj

— ANI (@ANI) February 13, 2024

  • ఢిల్లీ వ్యాప్తంగా నెలరోజులపాటు 144 సెక్షన్‌
  • డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న భద్రతా బలగాలు
  • అంబాల హైవేపైకి భారీగా రైతులు
  • ఢిల్లీలో భారీగా ట్రాఫిక్‌ జాం
  • రైతుల చలో ఢిల్లీ రహదారులను  మూసివేసిన పోలీసులు
  • పలుచోట్ల అతినెమ్మదిగా కదులుతున్న వాహనాలు

ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..

  • పంజాబ్‌,హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత
  • సరిహద్దుల వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు
  • రైతుల టియర్‌ గ్యాస్‌ ప్రయోగం
  • ఢిల్లీ ముట్టడికి రైతుల యత్నం
  • 2020 ఉద్యమం తరహాలో పోరుగు సిద్ధమైన రైతులు
  • పంజాబ్‌, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు
  • తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదన్న రైతులు 
  • ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలతో బయల్దేరిన రైతులు
  • ధీర్ఘకాలిక ఉద్యమాన్ని కొనసాగించాలని రైతులు నిర్ణయం 
  • మంత్రులతో చర్చలు విఫలం కావడంతో మొదలైన రైతుల మార్చ్‌
  • శాంతియూతంగా ఆందోళన కొనసాగిస్తామని  రైతులు స్పష్టం

సాక్షి, ఢిల్లీ: రైతుల ఢిల్లీ ఛలో యాత్రతో నగర సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది. ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంభూ సరిహద్దులో  అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు పోలీసులు.

డ్రోన్‌ ద్వారా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు.. అంబాల హైవే పైకి చేరారు.

మరోవైపు.. పంజాబ్‌, హర్యానాల నుంచి నిరసనకారులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తేఉన్నారు. ఇంకోపక్క రైతన్నల ఢిల్లీ ఛలో ప్రభావంతో.. నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపు.. తనిఖీలతో.. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతినిదానంగా వాహనాలు కదులుతుండడంతో.. కిలో మీటర్‌ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోందని వాహదనదారులు సోషల్‌ మీడియాలో వాపోతున్నారు.

రైతుల మెగా మార్చ్‌ను భగ్నం చేసేందుకు.. ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిమెంట్‌ దిమ్మెలు, కంచెలతో అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సింగూ, టిక్రిలతో పాటు ఢిల్లీ(ఘజియాబాద్‌), యూపీ నొయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్‌, చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని.. ఫెన్సింగ్‌లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు.

అలాగే అత్యవసరాల వస్తువులను సైతం అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్‌ 48పై కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆందోళనకు తరలివస్తున్న రైతుల్ని పంజాబ్‌ పోలీసులు అనుమతిస్తుండడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. మంగళవారం ఉదయం పంజాబ్‌, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

 కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ‘ఢిల్లీ చలో’ పేరుతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు కదిలారు. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపుభగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సోమవారం నాడు.. యాత్రను విరమించుకోవాలని సూచించిన కేంద్రం.. రైతుసంఘాల నాయకులతో చండీగఢ్‌ వేదికగా సోమవారం దాదాపు అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్‌కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్‌సింగ్‌ డల్లేవాల్‌, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తదితరులతో సమాలోచనలు జరిపింది.

డిమాండ్లు ఏంటంటే.. 

  • కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయడం,
  • స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు,
  • పంటరుణాల మాఫీ,
  • రైతులు-రైతుకూలీలకు పింఛన్లు ఇవ్వడం,

మూడు వ్యవసాయ చట్టాలకు (తర్వాత రద్దయ్యాయి) వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది.  వీటిలో.. 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుండా ఉండిఉంటే.. వారికీ పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ మార్చ్‌ యథాతథంగా కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వన్‌సింగ్‌ పంధేర్‌ ప్రకటించారు. మరోవైపు రైతు నాయకులతో కేంద్రం ఈ నెల 8న కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

ఆంక్షల వలయంలో హస్తిన
రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెల పాటు సెక్షన్‌-144 విధిస్తూ దిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నిరసనను సంఘ విద్రోహశక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ముప్పుందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement