‘రియల్‌ హీరో’పై హత్యాయత్నం కేసు!

28 Nov, 2020 11:31 IST|Sakshi

చండీగఢ్‌/ఢిల్లీ: ‘‘నా చదువు పూర్తైన తర్వాత మా నాన్నతో కలిసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. ఆయన రైతు నాయకుడు. రైతుల కోసం పోరాడతారు. నేను గానీ, మా నాన్న గానీ ఇంతవరకు ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. కానీ ఆ రోజు రైతులను గాయపరిచే విధంగా పోలీసులు భాష్పగోళాలు ప్రయోగించడంతో తట్టుకోలేకే వాహనం పైకి ఎక్కి కొళాయి కట్టేశాను. శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవడం ఎంత మాత్రం సరైంది కాదు. అంతేతప్ప వేరే ఉద్దేశం లేదు’’ అంటూ అంబాలాకు చెందిన యువ రైతు నవదీప్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 

కాగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు, రైతులు ‘చలో ఢిల్లీ’ పేరిట కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలకు దిగారు. భాష్ప వాయుగోళాలు ప్రయోగిస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో నవదీప్‌ పోలీసుల వాహనం పైకి.. కొళాయి కట్టేసి కిందకు దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టగా.. రైతుల పక్షాన నిలబడ్డ అతడిని ‘రియల్‌ హీరో’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. (చదవండి: రైతుల ‘చలో ఢిల్లీకి’ అనుమతి)

హత్యాయత్నం కేసు నమోదు
తాజా సమాచారం ప్రకారం.. పోలీసులు నవదీప్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటుగా తమ విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన నవదీప్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా గళం కేంద్రానికి వినిపించేలా శాంతియుత పద్ధతిలో నిరసన చేపట్టాం. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు లేదా. కుళాయి కట్టేసినందుకు నాపై కేసు నమోదు చేశారు’’ అని వాపోయాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా