సానుకూలంగా చర్చలు.. సరిహద్దులోనే రైతులు! | Farmers Protest Updates In Telugu: Delhi Chalo March On Talks With Centre To Continue Amid Bharat Bandh Call - Sakshi
Sakshi News home page

Delhi Farmers Protest: సానుకూలంగా చర్చలు.. సరిహద్దులోనే రైతులు!

Published Fri, Feb 16 2024 9:13 AM

Farmers Protest: Delhi March On Talks To Continue Bharat Bandh Updates - Sakshi

తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలో యాత్ర చేపట్టిన రైతులు.. తమ నిరసనల్ని కొనసాగించాలనే నిర్ణయించారు. గురువారం అర్ధరాత్రి దాకా కేంద్రంతో జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. అయితే సానుకూలంగానే జరిగినట్లు ఇటు కేంద్రం, అటు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ మీడియాకు తెలియజేశారు. కానీ, రైతు సంఘాలు మాత్రం కాలపరిమితితో కూడిన హామీ కోరుతున్నాయి. దీంతో ఇరువర్గాలు ఆదివారం సాయంత్రం మరోసారి భేటీ కావాలని నిర్ణయించాయి. అయితే.. 

తమ నిరసనలను మాత్రం కొనసాగించి తీరతామని, ఢిల్లీ మార్చ్‌ కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. మంగళ, బుధవారాల్లో అట్టుడికిన పంజాబ్‌, హర్యానా సరిహద్దులు.. చర్చల నేపథ్యంలో గురువారం కాస్త శాంతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అలాగే.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తాము వెనక్కి వెళ్లబోమని.. శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. 

చర్చలపై ఎవరేమన్నారంటే..
.. ఛండీగఢ్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద రాయ్‌తో రైతు సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా పాల్గొన్నారు. రైతుల డిమాండ్లలో ముఖ్యమైన అంశాలపై వివరంగా చర్చించామని.. సానుకూలంగా చర్చలు జరిగాయని మంత్రి అర్జున్‌ ముండా మీడియాకు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం జరగబోయే చర్చలతో ఇరువైపుల నుంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. 

రైతు సంఘాల నేతలతో జరిగిన చర్చలపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ.. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. అదే సమయంలో హర్యానా ప్రభుత్వం సరిహద్దులో వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 

ఇక రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర(MSP), రైతుల రుణమాఫీ లాంటి అంశాలపై చర్చించినా.. కాలపరిమితితో కూడిన హామీ దొరికితేనే తాము నిరసనలు విరమిస్తామని తెలిపారు. ‘‘కేవలం చర్చల కోసమే మేం లేం. పరిష్కారం కూడా కావాలి. అందుకు సమయం కావాలి అని వాళ్లు(కేంద్ర మంత్రుల్ని ఉద్దేశిస్తూ..) కోరారు అని రైతు సంఘాల నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో.. శాంతియుతంగా నిరసనలు కొనసాగిద్దామని రైతులకు సంఘాల నేతలు పిలుపుఇచ్చారు. ఇక తమ సోషల్‌ మీడియా అకౌంట్లపై ఆంక్షలు విధించడం..రైతులపై భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరును వాళ్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.  అదే సమయంలో.. 

నేడు బంద్‌కి పిలుపు
రైతు సంఘాలు శాంతియుతంగా ఢిల్లీకి యాత్ర నిర్వహిస్తామంటున్నాయి. ఇక సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఇచ్చిన గ్రామీణ భారత్‌ బంద్‌ నేపథ్యంలో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు వ్యవసాయ పనులు మాని.. రైతులంతా రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపాలని పిలుపు ఇచ్చింది కిసాన్‌ మోర్చా.  ఎమ్‌ఎస్‌పీ, కనీస పెన్షన్‌, కనీస వేతనం.. ఇలా  21 డిమాండ్ల సాధన కోసం తొమ్మిది యూనియన్ల సీనియర్‌ నేతలు ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద సంయుక్త నిరసన తెలిపేందుకు సిద్దం అయ్యారు.

రైతుల సంఘాలుఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపు నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. నోయిడాలో 144 సెక్షన్‌ విధించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement