Five States Assembly Election Results 2022: Counting Of Votes Starts From 8AM Today - Sakshi
Sakshi News home page

Assembly Election Results 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు.. గెలుపెవరిదో?

Published Thu, Mar 10 2022 6:52 AM

Five State Election 2022: Counting Of Votes From 8AM - Sakshi

న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం నేడు తుదిదశకు చేరుకోనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలకానున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్‌గా భావించే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌ రాష్ట్రాల నాయకత్వ పగ్గాలు ఏ పార్టీల చేతికొస్తాయో వెల్లడికానుంది. ఓట్ల లెక్కింపు క్రతువులో 50 వేల మంది అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) భాగస్వాములను చేసింది. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)లలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించేందుకు దాదాపు 1,200 కౌంటింగ్‌ కేంద్రాలను సిద్ధంచేశారు. 75 జిల్లాల్లో 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో 750 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పంజాబ్‌లో 200 కేంద్రాలు రెడీ అయ్యాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 650కి పైగా కౌంటింగ్‌ పర్యవేక్షకులు విధుల్లో పాల్గొంటారు. ర్యాండమ్‌గా ఒక్కో నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ బూత్‌ల చొప్పున అక్కడి ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్‌లనూ సరిపోల్చనున్నారు. కౌంటింగ్‌ నిరాటంకంగా కొనసాగేలా సాయపడేందుకు ఉప రిటర్నింగ్‌ అధికారి విధుల్లో ఉంటారు.  

కౌంటింగ్‌ కేంద్రాల్లో కోవిడ్‌ నిబంధనలు 
కౌంటింగ్‌ రోజున అమలుచేసేలా కోవిడ్‌ అదనపు నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్‌ ముగిశాక లెక్కింపు కేంద్రాలను తప్పకుండా శానిటైజ్‌ చేయాలి. భౌతిక దూరం పాటించేలా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా విస్తృత పరిధిలో కౌంటింగ్‌ సెంటర్లను సిద్ధంచేశారు. రెండు కోవిడ్‌ టీకాలు తీసుకున్నాసరే కరోనా లక్షణాలుంటే వారిని కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించబోరు. అధికారులు, భద్రతా బలగాల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరికీ మాస్క్, శానిటైజర్, ఫేస్‌ షీల్డ్, హ్యాండ్‌ గ్లౌజ్‌లు అందించనున్నారు. యూపీ సహా మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి ఫిబ్రవరి 10న మొదలైన ఈ పోలింగ్‌ ప్రక్రియ మార్చి ఏడో తేదీన ముగిసిన విషయం తెల్సిందే.

యూపీలో బీజేపీ, పంజాబ్‌ ఆప్‌? 
► గోవాలో హంగ్‌
► లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు  

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా కొన్ని గంటలు ఉందనగా లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని, పంజాబ్‌ కోటలో ఆప్‌ పాగా వేస్తుందని అంచనా వేసింది. ఇక ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలున్నాయన్న ఆ సంస్థ గోవాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడి తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలకంగా మారుతుందని పేర్కొంది. యూపీలో బీజేపీ 43% ఓట్ల షేర్‌తో సునాయాసంగా భారీ విజయం సాధిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ 35% ఓట్లకే పరిమితమైపోతుందని అంచనా వేసింది.

Advertisement
Advertisement