మెట్రో రీ ఓపెన్‌.. ఫైన్‌ల మోత | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ నిబంధనలను పాటించకపోతే భారీ జరిమానాలు

Published Sat, Aug 29 2020 10:50 AM

Flouting Covid-19 Norms in Metro Attract Heavy Fines Once it Reopens - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్‌ 4.0లో భాగంగా వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నారు మెట్రో అధికారులు. ఈ మేరకు గురువారం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు సమావేశం అయ్యి చర్చించారు. దీని ప్రకారం ఫేస్ మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, రైళ్లు లేదా ప్లాట్‌ఫామ్‌లలో సామాజిక దూరం పాటించకపోవడం, ఉమ్మి వేయడం, చెత్తాచెదారం పడేయడం.. ఖాళీగా ఉండటానికి ఉద్దేశించిన సీట్లపై కూర్చోవడం వంటివి చేస్తే భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. (చదవండి: కోవిడ్‌-19 : దీదీ కీలక నిర్ణయం)

అంతేకాక  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఒకరు నిత్యం మెట్రో రైలు, స్టేషన్‌లో ఉంటారని.. కోవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూస్తారని సమాచారం. ఇక నిబంధనలు పాటించని వారిపై ఫైన్‌ల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని వారికి మొదటిసారి 500 వందల రూపాయల జరిమానా విధిస్తారని.. పలుమార్లు నిబంధలు ఉల్లంఘించేవారి విషయంలో ఈ మొత్తం భారీగా పెరగనున్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ విధించిన నాటి నుంచి ఢిల్లీ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఇతర రవాణా మార్గాలను అనుమతిస్తున్నారు కానీ మెట్రో మాత్రం ప్రారంభం కాలేదు. దీని ద్వారా ప్రతి రోజు ఢిల్లీలో 2.4 మిలియన్ల మంది ప్రయాణిస్తారు. 

Advertisement
Advertisement