Story Of Ramnagar Forest Officer Known As Snake Man Who Rescued 400 Snakes - Sakshi
Sakshi News home page

పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్‌ మ్యాన్‌’ స్టోరీ!

Published Thu, Jun 29 2023 12:23 PM

Forest 0fficer is Famous as Snake Man - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ అటవీ విభాగంలో 21 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన కెరియర్‌లో ఏకంగా 400 పాములను పట్టుకున్నాడు. ఈ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా అతనికి వెంటనే ఫోన్‌ వస్తుంది. ఇంత భారీస్థాయిలో పాములను పట్టుకున్న ఆయనకు కొత్త గుర్తింపు వచ్చింది. 

ప్రపంచవ్యాప్తంగా 1,800 రకాల పాములు..
పామును చూడగానే ఎవరైనా భయంతో వణికిపోతారు. అది విషపూరితమైనా, ప్రమాదకారికాకపోయిన భయం అనేది అందరిలో కామన్‌. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,800 రకాల పాములు ఉన్నాయి. వీటిలో 60 జాతుల పాములు అంత్యంత విషపూరితమైనవి. ఆ పాముకు సంబంధించిన ఒక్క చుక్క విషమైనా మనిషిని ఇట్టే బలిగొంటుంది.

అయితే పాముల రక్షణ కోసం పాటుపడుతున్న కొందరిని మనం చూసేవుంటాం. వీరు పాములు ఎక్కడ కనిపించినా.. వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవులలో సురక్షితంగా విడిచిపెడుతుంటారు. 

400 విషపూరిత పాములను పట్టుకుని..
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ అటవీ విభాగంలో పనిచేస్తున్న బేచూ సింగ్‌ గత రెండు దశాబ్ధాలలో పాములను పట్టుకోవడంతో విశేష అనుభవం సంపాదించాడు. ఇప్పటివరకూ 400 విషపూరిత పాములను పట్టుకుని, వాటిని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టాడు. జైన్‌పూర్‌కు చెందిన ఆయన 2002 నుంచి రామ్‌పూర్‌ అటవీ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను పాములను పట్టుకునే తీరును చూసిన అధికారులు, గ్రామస్తులు అతనిని ‘స్నేక్‌ మ్యాన్‌’ అని పిలుస్తుంటారు. 

నదుల నుంచి విషపూరిత పాములు..
రామ్‌పూర్‌ ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో ఉంది. నదుల నుంచి ఇక్కడకు పాములు వస్తుంటాయి. స్థానికంగా ఎవరికి పాము కనిపించినా వారు ఈ విషయాన్ని అటవీశాఖకు తెలియజేస్తారు. ఈ సమాచారం అందుకోగానే అక్కడి అధికారులు పామును పట్టుకునేందుకు ఆ ప్రాంతానికి బేచూ సింగ్‌ను పంపిస్తారు. 


ఉన్నతాధికారుల ప్రశంసలు..
రామ్‌పూర్‌ అటవీశాఖ డీఎఫ్‌ఓ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ బేచూసింగ్‌ స్నేక్‌  మ్యాన్‌ ఆఫ్‌ రామ్‌పూర్‌గా పేరొందాడని తెలిపారు. అతను 400 పాములను పట్టుకున్నప్పటికీ వాటికి ఎటువంటి హాని చేయకుండా అడవుల్లో విడిచిపెట్టారన్నారు. తమకు ఎక్కడి నుంచి అయినా పాముల గురించి సమాచారం వస్తే వెంటనే అక్కడకు బేచూసింగ్‌ను పంపిస్తామన్నారు. 

Advertisement
Advertisement