ఒడిశా మాజీ సీఎం హేమానంద బిశ్వాల్‌ కన్నుమూత | Sakshi
Sakshi News home page

Hemananda Biswal: ఒడిశా మాజీ సీఎం హేమానంద బిశ్వాల్‌ కన్నుమూత

Published Sat, Feb 26 2022 7:23 AM

Former Odisha CM And Congress Leader Hemananda Biswal No More - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌(82) ఇకలేరు. స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు ఆయన కుమార్తె సునీత తెలిపారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అఖిల పక్ష నాయకులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పేరొందిన హేమానంద రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తొలుత 1989 డిసెంబర్‌ 7వ తేదీ నుంచి 1990 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండోసారి 1999 డిసెంబర్‌ 6వ తేదీ నుంచి 2000 మార్చి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు. 

ఝార్సుగుడ జిల్లాలోని ఠకురొపొడా గ్రామంలో 1939 డిసెంబర్‌ 1వ తేదీన జన్మించిన ఈయన 1970 దశకంలో పంచాయతీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఝార్సుగుడ జిల్లా, కిరిమిరా పంచాయతీ సమితి అధ్యక్షునిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1974లో ఝార్సుగుడ జిల్లా, లయికెరా నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో సుందరగఢ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1974 నుంచి 1977వ సంవత్సరం, 1980 నుంచి 2004వ సంవత్సరాల మధ్య 6 సార్లు రాష్ట్ర శాసనసభకు ఈయన ఎన్నికయ్యారు. 1985 నుంచి 1986వ సంవత్సరం వరకు రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేయడం విశేషం.
చదవండి: హిజాబ్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన కర్ణాటక హైకోర్టు

Advertisement

తప్పక చదవండి

Advertisement