రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు

Published Fri, Dec 22 2023 11:51 AM

French President Emmanuel Macron As 2024 Republic Day Chief Guest - Sakshi

ఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ నుంచి హాజరవుతున్న ఆరవ అధ్యక్షునిగా మాక్రాన్ నిలవనున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే.

గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ ఆయన హాజరుకాలేనని వెల్లడించారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. ఫ్రెంచ్ మాజీ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ 1976, 1998లో రెండుసార్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో ఈ వేడుకలకు హాజరయ్యారు.

భారత్‌లో జరిగిన జీ-20 మీటింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరయ్యారు. ప్రధాని మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు. మధ్యాహ్న భోజన సమావేశంలోనూ పాల్గొన్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై పురోగతి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. 

గతేడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలను ఆహ్వానిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021, 2022లో విదేశీ నేతలను ఆహ్వానించలేదు.

ఇదీ చదవండి: ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు


 

Advertisement
Advertisement