భారత ‘సూపర్‌ ఫోర్‌’ | Sakshi
Sakshi News home page

భారత ‘సూపర్‌ ఫోర్‌’

Published Wed, Feb 28 2024 3:11 AM

Gaganyaan mission: Four astronauts named for India first manned space mission - Sakshi

మన గగన్‌యాన్‌ వ్యోమగాములు వీళ్లే  

జాతికి పరిచయం చేసిన మోదీ 

దేశ ఆకాంక్షలకు ప్రతిరూపమంటూ ప్రశంస 

ప్రతిష్టాత్మక ఆస్ట్రోనాట్‌ వింగ్స్‌ ప్రదానం 

వచ్చే ఏడాది ఆరంభంలో అంతరిక్షంలోకి!

తిరువనంతపురం: భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది. మన అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్‌లో పాల్గొని రోదసిలోకి వెళ్లున్న నలుగురు భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్‌ కెపె్టన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్, అంగద్‌ ప్రతాప్, అజిత్‌ కృష్ణన్, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు.

వీరు నలుగురూ భారత వాయుసేనకు చెందిన ఫైటర్‌ పైలట్లే. కేరళలోని తుంబలో ఉన్న విక్రమ్‌ సారాబాయ్‌ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ‘ఆస్ట్రోనాట్‌ వింగ్స్‌’ను మోదీ ప్రదానం చేశారు. అనంతరం భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. ‘‘ఈ నలుగురు వ్యోమగాముల పేర్లు భారత విజయగాథలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నాలుగు దశాబ్దాలుగా దేశం కంటున్న కలను వారు నిజం చేయనున్నారు’’ అంటూ కొనియాడారు. ‘‘వీళ్లు కేవలం నలుగురు వ్యక్తులో, నాలుగు పేర్లో కాదు.

140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవనున్న నాలుగు ప్రబల శక్తులు!’’ అన్నారు. గగన్‌యాన్‌ మిషన్‌ పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుని మేకిన్‌ ఇండియాకు తార్కాణంగా నిలిచిందంటూ హర్షం వెలిబుచ్చారు. ఏ విధంగా చూసినా ఇది చరిత్రాత్మక మిషన్‌ అని చెప్పారు. ‘‘గతంలో భారతీయ వ్యోమగామి వేరే దేశం నుంచి విదేశీ రాకెట్‌లో రోదసీలోకి వెళ్లొచ్చారు.

మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత భారత్‌ అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. ఈసారి టైమింగ్, కౌంట్‌డౌన్, రాకెట్‌తో సహా అన్నీ మనం స్వయంగా రూపొందించుకున్నవే. గగన్‌యాన్‌ మిషన్‌లో వినియోగిస్తున్న ఉపకరణాల్లో అత్యధికం భారత్‌లో తయారైనవే. అంతరిక్ష రంగంలో భారత్‌ సాధిస్తున్న స్వావలంబనకు తార్కాణమిది’’ అన్నారు. ఈ అమృత కాలంలో భారత వ్యోమగామి దేశీయ రాకెట్‌లో చంద్రునిపై దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. 

అంతరిక్ష శక్తిగా భారత్‌ 
భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతి యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను ఎంతగానో పెంపొందిస్తోందని, 21వ శతాబ్దిలో మనం ప్రపంచశక్తిగా ఎదిగేందుకు బాటలు పరుస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రో సాధించిన పలు ఘన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘తొలి ప్రయత్నంలోనే అరుణగ్రహం చేరి అతి కొద్ది దేశాలకే పరిమితమైన అరుదైన ఘనత సాధించాం. ఒకే మిషన్‌లో 100కు పైగా ఉపగ్రహాలనూ రోదసిలోకి పంపాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా రికార్డు సృష్టించాం. ఆదిత్య ఎల్‌1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టాం.

ఇలాంటి విజయాలతో భావి అవకాశాలకు ఇస్రో సైంటిస్టుల బృందం నూతన ద్వారాలు తెరుస్తోంది. ఫలితంగా అంతరిక్ష రంగంలో భారత్‌ ప్రపంచ వాణిజ్య హబ్‌గా మారనుంది. మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రానున్న పదేళ్లలో ఐదింతలు పెరిగి 44 బిలియన్‌ డాలర్లకు చేరనుంది’’ అని చెప్పారు. ఇస్రో అంతరిక్ష మిషన్లలో మహిళా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ అన్నారు. చంద్రయాన్‌ మొదలు గగన్‌యాన్‌ దాకా ఏ ప్రాజెక్టునూ మహిళా శక్తి లేకుండా ఊహించుకోలేని పరిస్థితి ఉందన్నారు. 500 మందికి పైగా మహిళలు ఇస్రోలో నాయకత్వ స్థానాల్లో ఉన్నారంటూ హర్షం వెలిబుచ్చారు.  కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్, సీఎం పినరాయి విజయన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్, సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు. 

వారిది మొక్కవోని దీక్ష 
గగన్‌యాన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో నలుగురు వ్యోమగాములూ అత్యంత కఠోరమైన శ్రమకోర్చారంటూ మోదీ ప్రశంసించారు. ‘‘అత్యంత కఠినమైన శారీరక, మానసిక పరిశ్రమతో పాటు యోగాభ్యాసం కూడా చేశారు. ఆ క్రమంలో ఎదురైన ఎన్నో సవాళ్లను మొక్కవోని పట్టుదలతో అధిగమించారు. రోదసి మిషన్‌ కోసం తమను తాము పరిపూర్ణంగా సన్నద్ధం చేసుకున్నారు’’ అన్నారు.

వారు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు 13 నెలలు రష్యాలోనూ శిక్షణ పొందారు. మానవసహిత గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా 2025లో ముగ్గురు వ్యోమగాములను రోదసిలో ని 400 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్ష్యలోకి పంపి 3 రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావాలన్నది ఇస్రో లక్ష్యం. ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ నిలవనుంది. గగన్‌యాన్‌ మిషన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. 

హాయ్‌ వ్యోమమిత్రా 
గగన్‌యాన్‌ మిషన్‌ ప్రగతిని విక్రం సారబాయి స్పేస్‌ సెంటర్లో మోదీ సమీక్షించారు. మిషన్‌కు సంబంధించిన పలు అంశాలను సోమనాథ్‌తో పాటు ఇస్రో సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. మానవసహిత యాత్రకు ముందు గగన్‌యాన్‌లో భాగంగా రోదసిలోకి వెళ్లనున్న హ్యూమనాయిడ్‌ రోబో వ్యోమమిత్రతో సరదాగా సంభాషించారు. 

మహిళ ఎందుకు లేదంటే... 
గగనయాన్‌ మిషన్‌కు ఎంపికైన నలుగురిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. అంతరిక్ష యాత్రకు వ్యోమగాముల ఎంపిక ప్రక్రియే అందుకు కారణమని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిషన్లకు టెస్ట్‌ పైలట్ల పూల్‌ నుంచి మాత్రమే వ్యోమగాముల ఎంపిక జరుగుతుంది. అత్యున్నత వైమానిక నైపుణ్యంతో పాటు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరంగా వ్యవహరించగల సామర్థ్యం టెస్ట్‌ పైలట్ల సొంతం. గగన్‌యాన్‌ మిషన్‌కు ఎంపిక జరిపిన సమయంలో భారత టెస్ట్‌ పైలట్ల పూల్‌లో ఒక్క మహిళ కూడా లేరు. దాంతో గగన్‌యాన్‌ మిషన్‌లో మహిళా ప్రాతినిధ్యం లేకుండాపోయింది. భావి మిషన్లలో మహిళా వ్యోమగాములకు స్థానం దక్కుతుందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు.

3 ప్రాజెక్టులు జాతికి అంకితం 
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్‌ ప్రయోగాల నిమిత్తం సుమారు రూ.1,800 కోట్లతో నిర్మించిన మూడు ఇస్రో సెంటర్లను మోదీ తుంబా నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్‌ భవనం, ఇస్రో ప్రపొల్షన్‌ కాంప్లెక్స్‌లో సెమీ క్రయోజనిక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంజన్‌ అండ్‌ స్టేజ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ భవనం, విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో ట్రైనోసిక్‌ విండ్‌ టన్నెల్‌ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిద్వారా ఏటా 8 నుంచి 15 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది

Advertisement

తప్పక చదవండి

Advertisement