తెలుగు ఐఏఎస్‌ అధికారిని పొట్టనబెట్టుకున్న...గ్యాంగ్‌స్టర్‌ను వదిలేశారు! | Sakshi
Sakshi News home page

తెలుగు ఐఏఎస్‌ అధికారిని పొట్టనబెట్టుకున్న...గ్యాంగ్‌స్టర్‌ను వదిలేశారు!

Published Wed, Apr 26 2023 3:16 AM

 Gangster Anand Mohan is being released to secure Rajput votes in the elections, said Uma Devi - Sakshi

పట్నా: అతనో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌. మాజీ ఎంపీ కూడా. పేరు ఆనంద్‌ మోహన్‌. దాదాపు 30 ఏళ్ల కింద బిహార్‌లో ఏకంగా ఐఏఎస్‌ అధికారిపైకే మూకను ఉసిగొల్పి అత్యంత పాశవికంగా రాళ్ల దాడి చేయించి పొట్టన పెట్టుకున్నాడు. ఆ కేసులో 15 ఏళ్లుగా జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేస్తూ నితీశ్‌కుమార్‌ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏకంగా జైలు నిబంధనలనే మార్చేసింది! ఆనంద్‌తో సహా పలు తీవ్ర నేరాలకు పాల్పడి జీవితఖైదు అనుభవిస్తున్న మరో 26 మంది దోషుల విడుదలకు సోమవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రస్తుతం పెరోల్‌ మీద ఉన్న అతడు ఆ సమయంలో తన కుమారుడైన ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్‌ ఆనంద్‌ నిశ్చితార్థ వేడుకను ఆస్వాదిస్తున్నాడు! నితీశ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్‌లోని రాజకీయ తదితర రంగాల ప్రముఖులంతా అందులో పాల్గొన్నారు. తనకు విముక్తి ప్రసాదిస్తున్నందుకు నితీశ్‌కు ఆనంద్‌ మోహన్‌ కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో డెహ్రాడూన్‌లో జరిగే కొడుకు పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించుకుంటానంటూ హర్షం వెలిబుచ్చాడు. పెరోల్‌ ముగియడంతో మంగళవారం జైలుకు తిరిగి వెళ్లిన అతను బుధవారం రెమిషన్‌పై విడుదల కానున్నాడు.

నితీశ్‌ సర్కారు నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్పీ, బీజేపీతో పాటు ఐఏఎస్‌ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టగా అధికార జేడీ(యూ) మాత్రం సమర్థించుకుంది. క్షమాభిక్ష జాబితాలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషి ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే రాజ్‌ బల్లభ్‌ యాదవ్, పలు తీవ్ర క్రిమినల్‌ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే అవధేశ్‌ మండల్‌ కూడా ఉన్నారు.

ఏం జరిగింది? 
1994లో లాలుప్రసాద్‌ యాదవ్‌ హయాంలో బిహార్లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ బ్రిజ్‌ బిహారీ ప్రసాద్‌ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. మండల్‌ రిజర్వేషన్లపై దేశమంతా అట్టుడుకున్న వేళ అగ్రవర్ణ భూమిహార్‌ అయిన శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డిసెంబర్‌ 5న శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్‌ మోహన్‌ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న గోపాల్‌గంజ్‌ కలెక్టర్‌ అయిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్‌ అధికారి జి.కృష్ణయ్యను కార్లోంచి బయటికి లాగి రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి పొట్టన పెట్టుకున్నారు. ఆనంద్‌ మోహన్‌ దగ్గరుండి మరీ వారిని ఈ దాడికి ప్రేరేపించినట్టు చెబుతారు. ఈ కేసులో జైల్లో ఉండగానే ఎంపీగా గెలిచాడు. 2007లో కింది కోర్టు మరణశిక్ష విధించింది. దాంతో స్వతంత్ర భారత చరిత్రలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నాయకునిగా రికార్డుకెక్కాడు. తర్వాత దాన్ని పట్నా హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. అప్పట్నుంచీ అతడు జైల్లోనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల హత్యకు, అత్యాచారాలకు పాల్పడ్డవారికి రెమిషన్‌ మంజూరు చేయరాదన్న నిబంధనను నితీశ్‌ సర్కారు తాజాగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర జైలు మాన్యువల్‌ను సవరిస్తూ ఏప్రిల్‌ 10న నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఆనంద్‌ మోహన్‌ విడుదల కోసమేనని అప్పట్నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నితీశ్‌తో అతని బంధం ఇప్పటిది కాదు. వారిద్దరూ సమతా పార్టీ సహ వ్యవస్థాపకులు. 

కృష్ణయ్య...అట్టడుగు నుంచి ఎదిగిన తెలుగు తేజం
మూక దాడికి బలైన ఐఏఎస్‌ జి.కృష్ణయ్య తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు. ఇల్లు గడిచేందుకు తండ్రితో పాటు కూలి పనికి వెళ్లారు. జర్నలిజం కోర్సు చేసిన అనంతరం కొంతకాలం క్లర్కుగా, లెక్చరర్‌గా పని చేశారు. 1985లో సివిల్స్‌ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌గా బిహార్‌ క్యాడర్‌కు ఎంపికయ్యారు. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. రోజూ విధిగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు.

ఆయన దొరికిన తొలి పోస్టింగే బందిపోట్లకు, కిడ్నాపర్లకు స్వర్గధామంగా పిలిచే వెస్ట్‌ చంపారన్‌ జిల్లాలో! తన పనితీరుతో జిల్లాకున్న చెడ్డపేరుతో పాటు దాని రూపురేఖలనే సమూలంగా మార్చేశారని అక్కడ ఇప్పటికీ చెప్పుకుంటారు. తర్వాత నాటి సీఎం లాలు సొంత జిల్లా గోపాల్‌గంజ్‌ కలెక్టర్‌గా ఉండగా హత్యకు గురయ్యారు. అప్పుడాయనకు కేవలం 35 ఏళ్లు! ఈ దారుణంపై సీఎం హోదాలో లాలు పేలవ స్పందన తీవ్ర విమర్శలపాలైంది.

కృష్ణయ్యకు నివాళులర్పించేందుకు వచ్చిన లాలును వెళ్లిపొమ్మని ఆయన భార్య ఉమా దేవి తెగేసి చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నేరగాళ్లను జైళ్లలోంచి విడుదల చేసి విచ్చలవిడిగా సమాజంపైకి ఉసిగొల్పే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఎక్కడుంటుందన్న ఆమె ప్రశ్న చాలాకాలం అందరి మనసులనూ తొలిచేసింది. 

ఇప్పటికీ మాఫియా రాజ్యమే 
కృష్ణయ్య భార్య ఉమ ఆవేదన 
ఆనంద్‌ మోహన్‌ విడుదల వార్తతో దివంగత ఐఏఎస్‌ కృష్ణయ్య భార్య ఉమ షాకయ్యారు. తన గుండె పగిలిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం కొన్ని రాజ్‌పుత్‌ ఓట్ల కోసం ఒక దారుణమైన ఒరవడికి నితీశ్‌ సర్కారు శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు.

‘‘ఆనంద్‌ మోహన్‌ మరణశిక్ష ఇతర నేరగాళ్లకు ఓ హెచ్చరికలా, నికార్సైన అధికారులకు భరోసాగా ఉంటుందని ఆశపడ్డా. కానీ దాన్ని జీవితఖైదుకు తగ్గించారు. దానికే నేను తల్లడిల్లిపోతే ఇప్పుడేమో ఆ శిక్షనూ రద్దు చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ బిహార్లో మాఫియా రాజ్యమే నడుస్తోందని మరోసారి రుజువైంది. ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడేందుకు నేరగాళ్లకు ఇది మరింత ప్రోత్సాహమిస్తుంది. ఆనంద్‌ మోహన్‌ వంటి నేరగాళ్లు, వాళ్ల కుటుంబీకులే ఇంకా తమకు రాజకీయ ప్రాతినిధ్యం వహించాలా అన్నది రాజ్‌పుత్‌లు ఆలోచించుకోవాలి’’అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఈ నిర్ణయం రద్దయ్యేలా చూడాలని కోరారు. ‘‘ఇలాంటి కేసుల్లో దోషులు జీవితాంతం జైల్లో గడపాల్సిందే. అందుకే నితీశ్‌ సర్కారు నిర్ణయంపై పట్నా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంది. దీనిపై నా భర్త బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులతో చర్చిస్తున్నా’’అని వెల్లడించారు.  కృష్ణయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తండ్రిని కోల్పోయేనాటికి వారికి పెద్ద కూతురు నిహారికకు ఏడేళ్లు, చిన్నమ్మాయి పద్మకు ఐదేళ్లు. వారిని తీసుకుని ఉమ హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా రిటైరయ్యారు. నిహారిక బ్యాంక్‌ మేనేజర్‌గా, పద్మ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.  


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement