High Court Asks Centre to Reduce Age of Consent of Women - Sakshi
Sakshi News home page

శృంగారానికి 18 ఏళ్ల వయసొద్దు.. ‘సమ్మతి’ వయసు 16కు తగ్గించండి: కేంద్రానికి హైకోర్టు కీలక వినతి

Published Sun, Jul 2 2023 12:45 PM

High Court Asks Centre to Reduce Age of Consent of Women - Sakshi

యువతులు తమ సమ్మతి మేరకు లైంగిక సంబంధాలను ఏర్పరుచుకునే వయసును 16 సంవత్సరాలకు తగ్గించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్డుకు చెందిన గ్వాలియర్‌ బెంచ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రస్తుతం ఇందుకోసం అనుమతించిన 18 ఏళ్ల​ వయసు కారణంగా పలు అనర్థాలు ఎదురవుతున్నాయని బెంచ్ పేర్కొంది. దీనికారణంగా యువతులపై అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేస్తూ..
జూన్‌ 27న ఒక కేసు ఉత్తర్వుల నేపధ్యంలో కోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అభ్యర్థన అందింది. ఈ కేసులో ఒక బాలికపై అత్యాచారం చేశాడంటూ ఒక వ్యక్తిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేశారు. అతను 2020లో ఒక మైనర్‌ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆమెను గర్భవతిని చేశాడనే ఆరోపణలు వచ్చాయి. 

సోషల్‌ మీడియా ‍ప్రభావంతో..
ఈ కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి దీపక్‌ కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఈ రోజుల్లో సోషల్‌ మీడియా ‍ప్రభావంతో పాటు సులభంగా ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం కారణంగా 14 ఏళ్ల వయసుకే పిల్లలు అన్ని విషయాలు తెలుసుకుని, ముందుగానే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నారని అన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగానే యవ్వనావస్థకు చేరుకుంటున్నందున ఒకరికొకరు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఫలితంగా వారు ఇష్టాపూర్వకంగానే శారీరక సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారని పేర్కొన్నారు. 

అందుకే సమాజంలో అనేక అనర్థాలు
న్యాయమూర్తి తన ఉత్తర్వులలో.. తాను భారత ప్రభుత్వానికి ఒక విషయాన్ని అభ్యర్థించాలనుకుంటున్నానన్నారు. యువతుల విషయంలో లైంగిక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు ఇప్పటి వరకూ ఉన్న నిర్ణీత వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించే దిశగా ఆలోచించాలని కోరుతున్నానన్నారు. దీని వలన యువతులపై జరిగే అకృత్యాలను నివారించవచ్చని పేర్కొన్నారు. యువతులు లైంగిక సంబంధాలకు తమ సమ్మతి తెలియజేసే వయసు 18 ఏళ్లుగా ఉండటం వలన సమాజంలో అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. 

కేసు పూర్వాపరాలివే..
ఇక ఈ కేసు విషయానికొస్తే బాధితురాలు 2020లో మైనర్‌. ఆమె ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర కోచింగ్ తరగతులకు హాజరయ్యేది. ఆ‍ వ్యక్తి తనకు ఒకసారి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి, అత్యాచారం చేశాడని ఆరోపించింది. అలాగే దానిని వీడియో తీశాడని, తరువాత బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. 

పురుషులు మాత్రమే దోషులు కారు
కాగా ఆ మైనర్  బాలిక ఒక దూరపు బంధువుతో కూడా శారీరక సంబంధాలు పెట్టుకున్నదని కోర్టు పేర్కొంది. ఆ వయసులో ఉన్న బాలిక తన శారీరక, మానసిక, వ్యక్తిగత అభివృద్ధికి  సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని న్యాయస్థానం సహేతుకంగా పరిగణిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాధారణంగా యుక్తవయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలు పరస్పరం స్నేహం ఏర్పరుచుకుని, ఆ తర్వాత ఆకర్షణ కారణంగా శారీరక సంబంధాలను ఏర్పరుచుకుంటారని, ఇటువంటి ఈ కేసులలో పురుషులు దోషులు కారని న్యాయమూర్తి తన ఆదేశాలలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: కేంద్ర ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వండి

Advertisement

తప్పక చదవండి

Advertisement