మీకు జీవితఖైదు సరైనదే: షాక్‌ ఇచ్చిన హైకోర్టు

5 Jan, 2023 08:58 IST|Sakshi

సాక్షి, శివాజీనగర: డబ్బు కోసం స్నేహితున్ని హత్య చేసిన కేసులో ముంబైకి చెందిన ఇద్దరు యువతులతో పాటు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పును రద్దు చేయాలని, లేదా సవరించాలని దోషులు రోహిత్‌ కుమార్‌– జార్ఖండ్, శివానీ ఠాకూర్, ప్రీతి రాజ్‌ – ముంబై, వారీస్‌– బిహార్‌.. వేసుకున్న అప్పీల్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్‌ వీ.వీరప్ప ధర్మాసనం కొట్టివేసింది.  

హత్య కేసు వివరాలు..  
వివరాలు.. వారిస్, తుషార్‌ రాజస్థాన్‌లో కలసి చదువుతుండేవారు. ఇంజనీరింగ్‌ చదివేందుకు తుషార్‌ బెంగళూరుకు వచ్చాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన తుషార్‌ను కిడ్నాప్‌ చేయాలని వారిస్‌ కూడా బెంగళూరులో మకాం వేశాడు. ఇక్కడే ఉద్యోగం చేస్తున్న తన బంధువైన ప్రీతి, శివానిని తుషార్‌కు పరిచయం చేశాడు. నిందితులు 2011 జనవరి 14న తుషార్‌ను కిడ్నాప్‌ చేసి హత్యచేసి వీరసాగర రోడ్డు నీలగిరి తోపులో పడేశారు.

జనవరి 16న అతని తండ్రికి కాల్‌ చేసి మీ కుమారుడిని కిడ్నాప్‌ చేశాం. రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో తుషార్‌ తండ్రి బిహార్‌ నుంచి బెంగళూరుకు వచ్చి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. రైల్వేస్టేషన్‌ వద్ద డబ్బు ఇస్తామని పిలిపించగా రెండో నిందితుడు రోహిత్‌ వచ్చాడు. అతన్ని పట్టుకుని మిగతావారినీ అరెస్టు చేశారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ లో నేరం రుజువు కావడంతో 2014 నవంబరులో నలుగురికీ జీవిత ఖైదుని విధించింది. హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పుని సమర్థించింది. 

(చదవండి: భార్య నుంచి కాపాడాలని మొర )

మరిన్ని వార్తలు