దేశ విభజనకు మౌంట్‌ బాటన్‌ కారకుడా? సరిహద్దులు ప్రకటించినప్పుడు ఏం జరిగింది? | Sakshi
Sakshi News home page

Partition of India: దేశ విభజనకు మౌంట్‌ బాటన్‌ కారకుడా?

Published Sun, Sep 10 2023 11:38 AM

How Much Responsible Lord Mountbatten was for Partition of India - Sakshi

1947లో భారతదేశ స్వాతంత్ర్య ప్రక్రియలో మనదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కీలకపాత్ర పోషించారు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి, జూన్ 1948 లోపు ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చేలా దేశంలో అధికార మార్పిడి ప్రక్రియను నిర్ధారించడానికి  1947 ఫిబ్రవరిలో లార్డ్ మౌంట్ బాటన్‌ను భారతదేశానికి పంపించారు. ఈ నేపధ్యంలో దేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్రణాళికను రూపొందించారు. అయితే దేశ విభజనకు లార్డ్ మౌంట్ బాటన్ ఎంతవరకు కారణమనే ప్రశ్న కొందరు మేథావులలో తలెత్తెతుంటుంది. 

మౌంట్‌బాటన్ భారత దేశానికి రాకముందే..
మౌంట్‌బాటన్ 1900, జూన్‌ 25న విండ్సర్‌లో జన్మించారు. బ్రిటీష్ నావికాదళంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. అతనికి బ్రిటిష్ రాజకుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మౌంట్‌బాటన్ భారత దేశానికి రాకముందే భారతదేశ విభజనకు పునాది పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు భారీ నష్టాలను చవిచూశారు. యుద్ధం ముగిసే సమయానికి వారు భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అనేక ప్రణాళికలు రూపొందించారు. వీటిలో వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లు భారతదేశంలో తిరస్కరణకు గురయ్యాయి. భారతదేశంలో హిందూ-ముస్లిం విభజన రెండవ ‍ప్రపంచ యుద్ధ సమయంలోనే తీవ్రమైంది.

ఢిల్లీ, ముంబై, రావల్పిండిలో మతకల్లోలాలు 
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్‌లోని నూతన బ్రిటిష్ ప్రభుత్వం 1947, ఫిబ్రవరి 20న లార్డ్ మౌంట్ బాటన్‌ను భారతదేశానికి కొత్త వైస్రాయ్‌గా నియమించింది. విభజనను వీలైనంత వరకు అడ్డుకోవాలని మౌంట్ బాటన్‌కు బ్రిటీష్‌ ప్రభుత్వం సూచించింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే స్వేచ్ఛ కూడా అతనికి అప్పగించారు. అయితే 1948 జూన్ నాటికి, బ్రిటిష్ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని విడిచిపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మౌంట్ బాటన్ 1947, మార్చి 22న భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీ, ముంబై, రావల్పిండిలో మతకల్లోలాలు తలెత్తాయి. 

భారత్‌లో ఉన్నామా?.. పాకిస్తాన్‌లో ఉన్నామా?
పరిస్థితులకు అనుగుణంగా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం జరిగితే, అంతర్యుద్ధం చెలరేగవచ్చునని మౌంట్ బాటన్ గ్రహించారు. విభజన లేకుండా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని తొలుత మౌంట్‌ బాటన్‌ అనుకున్నారు. కానీ ముస్లిం లీగ్ పట్టుదల కారణంగా మౌంట్ బాటన్ విభజన నిబంధనతో 1047 జూన్ 3 ప్రణాళికను సమర్పించవలసి వచ్చింది. బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టడానికి  తొందరపడ్డారని, ఇందుకు మౌంట్ బాటన్ ఉద్దేశాలు కారణమని చెబుతుంటారు. మౌంట్ బాటన్ ప్రతిపాదన ప్రకారం, బ్రిటీష్ పార్లమెంట్ 1947 జూలై 4న భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా ఆగస్టు 15ని నిర్ణయించింది. దీనితోపాటు భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించి, ఆగస్టు 17న లైన్ ప్రకటించారు. అప్పటి వరకు సరిహద్దుకు ఇరువైపున గల ప్రజలు భారత్‌లో ఉన్నామా, లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అనేది తెలియని స్థితిలో ఉన్నారు. ఈ కారణంగా తలెత్తిన అల్లర్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదిఏమైనప్పటికీ మౌంట్‌బాటన్ విభజన  విషాదాన్ని తగ్గించారా లేదా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది.
ఇది కూడా చదవండి: చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది?

Advertisement

తప్పక చదవండి

Advertisement