ఒక్క డోసుతో డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ: ఐసీఎంఆర్‌

4 Jul, 2021 19:02 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓవైపు వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగాలు సాగుతూనే ఉండగా, మరోవైపు కోవిడ్ కొత్త కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఓ శుభవార్త చెప్పింది. 

కరోనా బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్‌ సింగిల్‌ డోసు ఇస్తే చాలని.. ఇది డెల్టా వేరియంట్‌ నుంచి సైతం రక్షణ కల్పింస్తుందని తేల్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నవారితో.. కరోనా నుంచి కోలుకుని, ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని పోల్చిచూస్తే డెల్టా వేరియంట్‌ నుంచి సైతం అత్యధిక రక్షణ పొందారని ఐసీఎంఆర్‌ అధ్యయనం తేల్చింది. కోవిడ్‌ బారిన పడిన వారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీస్‌కు వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ కలిస్తే, మరింత ప్రమాదకర వేరియంట్ల నుంచి కూడా రక్షణ లభిస్తుందని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు