శత్రు దుర్భేద్యంగా ఢిల్లీ

15 Aug, 2021 03:00 IST|Sakshi
ఎర్రకోట వద్ద పోలీసులను మోహరించిన దృశ్యం

స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా భద్రత కట్టుదిట్టం

ఎర్రకోట వద్ద యాంటీ–డ్రోన్‌ వ్యవస్థ ఏర్పాటు

నేడు త్రివర్ణ పతాకావిష్కరణ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

న్యూఢిల్లీ: డెభ్బై ఐదవ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ అంతటా అనూహ్య రీతిలో భద్రతా బలగాలను మోహరించారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో నిఘాను పెంచారు. ఎనిమిది నెలలుగా సాగు చట్టాలపై రైతులు ఉద్యమిస్తున్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోనూ గస్తీని ఎక్కువచేశారు. వేడుకలకు ప్రధానవేదిక అయిన, ప్రధాని మోదీ ప్రసంగించనున్న ఎర్రకోట వద్ద బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్‌ టర్మినల్స్‌ వద్ద పోలీసుల సంఖ్యను పెంచారు. జమ్మూ ఎయిర్‌పోర్టులోని వైమానిక స్థావరంపై ఉగ్ర డ్రోన్‌ దాడి నేపథ్యంలో ఎర్రకోట వద్ద యాంటీ– డ్రోన్‌ వ్యవస్థతో బలగాలు సిద్ధంగా ఉన్నాయి.

ఉగ్ర కుట్రలను భగ్నంచేసేందుకు యమునా తీరప్రాంతాలుసహా నగరంలోని ముఖ్యప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను అధికంచేశారు. కొత్తగా అద్దెకొచ్చిన వారిని, సిమ్‌కార్డులు, పాత కార్లు, బైక్‌లు అమ్మే డీలర్లను అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో విచారిస్తున్నారు. 16వ తేదీ వరకు హాట్‌ ఎయిర్‌బెలూన్లుసహా మరే ఇతర ఎగిరే వస్తువులను ఢిల్లీ గగనతలంపైకి తేవడాన్ని నిషేధించారు. ఆదివారం ఉదయం ఎర్రకోటపై మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని మోదీ ఎగరేయనున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి వాయుసేనకు చెందిన ఎంఐ–17 1వీ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించనున్నాయి. వేడుకల్లో రెండు ఎంఐ హెలికాప్టర్లు పాల్గొనడం ఇదే తొలిసారి. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. హెల్త్‌వర్కర్ల వంటి కోవిడ్‌ వారియర్స్‌ను సత్కరించేందుకు దక్షిణం వైపు ప్రత్యేక వేదిక ఏర్పాటుచేశారు.  

1.5 కోట్ల మంది జాతీయ గీతం పాడారు..
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 1.5 కోట్ల మంది భారతీయులు జాతీయ గీతం ఆలపిస్తూ వీడియోలు చిత్రీకరించి రాష్ట్రగాన్‌డాట్‌ఇన్‌ అనే వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో పాల్గొనాలని గత నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ తన మన్‌కీబాత్‌ కార్యక్రమంలో కూడా పిలుపునిచ్చారు. దీంతో దేశవిదేశాల్లోని భారతీయులు జనగణమన ఆలపిస్తూ వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. ఇందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారి వరకు పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.  
 

మరిన్ని వార్తలు