తగ్గుతున్న కరోనా కొత్త కేసులు

29 Oct, 2020 04:18 IST|Sakshi

న్యూఢిల్లీ/లండన్‌: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 50 వేల లోపే నమోదవుతోంది. గత 24 గంటల్లో 43,893 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,90,322కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 508 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,20,010కు చేరుకుందని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 72,59,509కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,10,803గా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 90.85శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.50గా ఉంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా సోకింది.  

తొలి టీకాలు అంతంతమాత్రమే
కరోనా వైరస్‌ నియంత్రణ కోసం అభివృద్ధి చేస్తున్న తొలి తరం వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందరికీ పనిచేసే అవకాశాలు తక్కువేనని కోవిడ్‌ వ్యాక్సిన్లపై యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ అధ్యక్షుడు కేట్‌ బింగమ్‌ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌పై అతిగా ఆశలు పెంచుకోవడం కంటే.. నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నివారించడం చాలా ముఖ్యమని తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీ, సేకరణ, పంపిణీ వంటి అంశాలపై కేట్‌ ద లాన్సెట్‌ కోసం రాసిన కథనంలో ఈ విషయాలను పేర్కొన్నారు.

తొలి తరం వ్యాక్సిన్ల సమర్థతపై సందేహాలు ఉన్న నేపథ్యంలో అవి వ్యాధిని నియంత్రించకపోయినా లక్షణాలు తగ్గిస్తుందని, అందరికీ అన్నివేళలా పనిచేయదు అన్న వాస్తవానికి సిద్ధమై ఉండాలని అన్నారు. అరవై ఐదేళ్ల పైబడ్డ వృద్ధుల్లోనూ రోగ నిరోధక వ్యవస్థ స్పందనను కలుగ చేసే టీకాలపై తాము దృష్టి కేంద్రీకరించామని, కోవిడ్‌ కారణంగా మరణించిన వారిలో మూడొంతుల మంది ఈ వయసు వారేనని ఆమె పేర్కొన్నారు. సనోఫి, గ్లాక్సో స్మిత్‌ క్‌లైన్‌ ఔషధ తయారీ సంస్థలు 20 కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లను కోవాక్స్‌ ఫెసిలిటీకి అందించడానికి అంగీకరించాయి. కోవాక్స్‌ ఫెసిలిటీ అన్ని దేశాలకూ సమానంగా కరోనా వ్యాక్సిన్‌లను అందించే వ్యవస్థ. సనోఫి, జీఎస్‌కె ప్రయోగాలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఈ సంవత్సరం చివరినాటికి మూడో దశ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఆ కంపెనీలు తెలిపాయి.

పేద దేశాల్లో మరణాలు తక్కువ
పుణే: అన్ని వసతులు ఉన్న ధనిక దేశాలతో పోల్చుకుంటే, తక్కువ పరిశుభ్రత, తక్కువ పారిశుద్ధ్యం, సురక్షిత నీటి సరఫరాలేని దేశాల్లోనే కోవిడ్‌ 19 మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు భారతీయ పరిశోధకులు తెలిపారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్సెస్‌ (ఎన్‌సీసీఎస్‌), చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీన్ని మెడ్రిక్సివ్‌ అనే జర్నల్‌లో ప్రచురిం చారు. వీరు 106 దేశాల్లో జనాభా సంఖ్య, ప్రస్తుతం ఉన్న వ్యాధులు, బీసీజీ వ్యాక్సి నేషన్, పారిశుద్ధ్యం, ప్రతి పది లక్షలకు  కోవిడ్‌ మరణాలు లాంటి 25 నుంచి 30 ప్రమా ణాలను పరిగణనలోనికి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ధనిక దేశాల్లో కోవిడ్‌ బారిన పడేవారి సంఖ్య తక్కువాదాయ దేశాలకంటే ఎక్కువగా ఉందన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు