రైల్వే శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ట్రైన్‌ హోటల్స్‌!

26 Feb, 2023 12:10 IST|Sakshi

సాక్షి, చెన్నై: వృథాగా ఉన్న రైలు బోగీలను హోటళ్లుగా మార్చేందుకు దక్షిణ రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది. తొలి విడతలో మూడు చోట్ల ట్రైన్‌ హోటళ్లు ఏర్పాటు చేయనుంది. వివరాలు.. దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు రోజూ వేలాది మంది ప్రయాణికులు వచ్చి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సరైన హోటళ్లు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ప్రయాణికులను ఆకర్షించే విధంగా వృథాగా ఉన్న బోగీల్లో హోటళ్ల ఏర్పాటపై దృష్టి సారించింది.

ఈ హోటళ్ల నిర్వహణ ప్రైవేటు సిబ్బందికి అప్పగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా దక్షిణ రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. ఇప్పటికే అనేక చోట్ల నగరాల్లో ప్రైవేటు హోటళ్లు రైళ్ల తరహాలో సెట్టింగ్‌ లు, పెయింటింగ్స్‌తో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అయితే, రైల్వే యంత్రాంగం నిజమైన రైలు బోగీలను హోటళ్లుగా మార్చనుండడం విశేషం. రైలులో ప్రయాణిస్తూ ఆహారాన్ని తింటున్నామనే అనుభూతిని కలిగించేలా.. ఆయా బోగీలలో ప్రత్యేక డిజైన్లు, సీట్లను ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

వారికి టెండర్ల ద్వారా ఈ హోటళ్లను త్వరలో కేటాయించనున్నారు. 24 గంటల పాటూ ఇవి సేవలు అందించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. ఒకే సమయంలో ఓ బోగీలో 40 మంది కూర్చుని ఆహారం తినేందుకు తగినట్లు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో చెన్నై సెంట్రల్, పెరంబూరు, కాటాన్‌ కొళ్తూరు స్టేషన్లలో ఈ రైలు బోగీల హోటళ్లకు ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లను ఆహా్వనించనున్నారు.

చదవండి   ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ!

మరిన్ని వార్తలు