Iraq Government Order Telangana Migrant Workers To Pay 1,500 Dollars - Sakshi
Sakshi News home page

తెలంగాణ వలస ​కార్మికుల షాక్‌! రూ.లక్ష జరిమానా కట్టి మీ దేశం వెళ్లండి!

Published Wed, Apr 19 2023 12:22 PM

Iraq Government Order To Telangana Migrant Workers Pay 1500 Dollars - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఉపాధిని వెతుక్కుంటూ ఇరాక్‌ వెళ్లిన తెలంగాణ వలస ​కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో ఇంటికి చేరుకోవాలంటే రూ.లక్ష జరిమానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం నిర్దేశించింది. అకామ లేకపోవడంతో ఎవరూ పనిఇవ్వడం లేదని, పార్కులలో తలదాచుకుంటూ అష్టకష్టాలు పడుతున్న తమకు జరిమానా చెల్లించే స్తోమత లేదని వలస కార్మికులు వాపోతున్నారు. ఎర్బిల్‌ పట్టణంలో తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు సుమారు 20 మంది వరకు ఉండిపోయారు.

గతంలో అకామ లేనివారిని ఇరాక్‌లో మన రాయబార కార్యాలయం అధికారులు జరిమానాను తప్పించి ఇంటికి పంపించారు. అలా వందలాది మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరుకున్నారు. కాగా కొంత మంది మాత్రం ఇంటికి రాకుండా ఇరాక్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇరాక్‌లో చట్టవిరుద్ధంగా ఉన్నవారిపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులు ఇంటికి చేరుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ. వెయ్యి నుంచి 1,500 వరకు అమెరికన్‌ డాలర్లు (మన కరెన్సీలో రూ. లక్షకు పైగా) జరిమానా చెల్లిస్తేనే విదేశీ కార్మికులను వారి దేశాలకు వెళ్లడానికి అనుమతిస్తామని ఇరాక్‌  ప్రభుత్వం స్పష్టం చేసింది.

చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో ఉన్న తాము జరిమానా చెల్లించి, విమాన టికెట్‌ను కొనేందుకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలని వలస కార్మికులు వాపోతున్నారు. మంచిర్యాల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు చెందిన వలస కార్మికులు ఇరాక్‌లో ఉండిపోయారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇరాక్‌లోని వలస కార్మికులు ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన​్‌ను ఆశ్రయించగా సదరు సంస్థ ప్రతినిధులు విదేశాంగ శాఖను సంప్రదించారు. వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌కు ప​్రవాసీ మిత్ర సంస్థ ప్రతినిధులు సమాచారం అందించారు.

ఇంటికి రప్పించడానికి చొరవ తీసుకోవాలి...
గడువు ముగిసిపోవడంతో మాకు పనివ్వడం లేదు. కరోనా వల్ల అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఇంటికి రావాలంటే జరిమానా చెల్లించడానికి మా వద్ద డబ్బులు లేవు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని వలస కార్మికులను ఇంటికి రప్పించాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement