చంద్రయాన్‌-3.. ఏం పర్వాలేదు | ISRO Chairman Post Chandrayaan 3 Plans Rover Sleep Mode - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-3.. రోవర్‌ స్లీప్‌మోడ్‌.. టాస్క్‌ కంప్లీటెడ్‌!

Published Fri, Sep 29 2023 6:59 AM

Isro chairman post Chandrayaan 3 plans Rover Sleep Mode - Sakshi

అహ్మదాబాద్‌: చంద్రయాన్‌-3 ప్రాజెక్టుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్‌ సోమనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై అడుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్‌ తనకు అప్పగించిన పనిని ఇప్పటికే పూర్తి చేసేసిందని, స్లీప్‌ మోడ్‌ నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేం లేదని వెల్లడించారాయన. 

గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ ఇంకా స్లీప్‌ మోడ్‌లోనే ఉండడం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. స్లీప్‌ మోడ్‌లోనే ఉన్నా పర్వాలేదని సమాధానం ఇచ్చారు.  ‘‘చంద్రుడిపై రాత్రి పూట (భూమిపై 15 రోజులకు సమానం) పగలు కంటే దాదాపు 200 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ఒకవేళ ప్రజ్ఞాన్‌ రోవర్‌లోని ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌లు ఈ ఉష్ణోగ్రత మార్పును తట్టుకొని నిలబడగలిగితే.. రోవర్‌ కచ్చితంగా మేల్కొంటుంద’’ని చెప్పారు.  అయితే.. ప్రజ్ఞాన్‌ తిరిగి యాక్టివ్‌ కాకపోయినా పర్వాలేదని, ఇప్పటికే దాని పని అది పూర్తి చేసిందని అన్నారు. 

చంద్రుడిపై రాత్రి సమయం పూర్తయిన తర్వాత విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నించినట్లు ఇటీవల ఇస్రో వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 2న రోవర్‌, 4న ల్యాండర్‌ను ఇస్రో స్లీప్‌ మోడ్‌లోకి పంపింది.

మరోవైపు.. ఖగోళాన్ని మరింతలోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్‌ శాటిలైట్‌ (ఎక్స్‌పోశాట్‌)పై ప్రస్తుతం దృష్టి సారించినట్లు చెప్పారు. నవంబర్‌ లేదా డిసెంబర్‌ నెలల్లో ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అధ్యయనానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. అలాగే.. రాబోయే రోజుల్లో శుక్ర గ్రహ పరిశోధనలకు ఇస్రో సంసిద్ధమవుతోందని తెలిపారాయన. 

Advertisement
Advertisement