భర్త చేసిన పనికి మేయర్‌ సస్పెండ్‌.. కాంగ్రెస్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

6 Aug, 2023 19:34 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మునేశ్‌ గుర్జర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. గుర్జర్‌పై రాజస్థాన్‌ ప్రభుత్వం వేటువేసింది. ఓ భూమి లీజ్‌ వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్‌ చేస్తూ గెహ్లాట్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

వివరాల ప్రకారం.. మేయర్‌ మునేశ్‌ గుర్జర్‌ భర్త సుశీల్‌ గుర్జర్‌ ఓ భూమి లీజ్‌ వ్యవహారంలో లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీక అధికారులకు చిక్కాడు. మేయర్‌ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేయర్‌ మునేశ్‌ గుర్జర్‌ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక, ఆమె ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్‌ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

కాగా, కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను కూడా సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్‌ 43 కార్పొరేటర్‌ పదవి నుంచి కూడా సస్పెండ్‌ చేసింది. మరోవైపు.. ఈ కేసులో నారాయణ్ సింగ్, అనిల్ దూబే అనే మరో ఇద్దరిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ సర్కార్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మేయర్‌ లంచం కేసు వ్యవహారం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది.

ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..?

మరిన్ని వార్తలు