పాక్‌ గడ్డపై స్పీచ్‌తో సర్జికల్‌ స్ట్రైక్‌.. జావేద్‌ అక్తర్‌పై సర్వత్రా ప్రశంసలు

21 Feb, 2023 14:55 IST|Sakshi

ప్రముఖ సినీ గేయ రచయిత, ఉర్దూ కవి జావేద్‌ అక్తర్‌.. తాజాగా పాకిస్తాన్‌ గడ్డపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాతో తెగ వైరల్‌ అవుతున్నాయి. ముంబై 26/11 దాడులకు కారకులైన ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఈ పరిణామం భారతీయుల గుండెల్లో చేదు నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. 

దిగ్గజ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ సంస్మరణార్థం కిందటి వారం లాహోర్‌(పాక్‌)లో ఓ కార్యక్రమం జరిగింది. దానికి జావేద్‌ అక్తర్‌ హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడున్న ఆడియొన్స్‌లో  కొందరు ఆయనకు పలు ప్రశ్నలకు సంధించారు. మీరు పాకిస్తాన్‌కు ఎన్నోసార్లు వచ్చారు. మరి మీకు వెనక్కి వెళ్లాక.. మీ ప్రజలకు పాక్‌ వాళ్లు మంచోళ్లు అని, బాంబులు పేల్చే రకం మాత్రమే కాదు.. పూలమాలతో ప్రేమను కూడా కురిపిస్తారని అక్కడి ప్రజలకు మీరు ఎప్పుడైనా చెప్పారా? అని జావేద్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన.. 

ఇక్కడి ఎవరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు.ఇరు దేశాల ప్రజల ద్వేషం దేనిని పరిష్కరించదు. ఇక్కడ ఇరు దేశాల మధ్య వాతావరణం ఉత్కంఠభరితంగా మాత్రమే ఉంది. ముంబై ప్రజలమైన మేం.. ఉగ్రవాద దాడులను కళ్లారా చూశాం. దాడికి పాల్పడ్డవాళ్లు ఎక్కడో నార్వే నుంచో, ఈజిప్ట్‌ నుంచో రాలేదు. వాళ్లు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు భారతీయుల కోపానికి అర్థం ఉంది. దానిపై మీరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు అని కుండబద్ధలు కొట్టారాయన. 

అంతేకాదు.. పాక్ దిగ్గజాలకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్‌లో స్వాగతం లభించలేదని ఆయన ఎత్తిచూపారు. ఉదాహరణకు.. ఫైజ్‌ సాబ్‌ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన్ని ప్రముఖ సందర్శకుడిగా భావించింది భారత్‌. అదంతా అంతటా ప్రసారం అయ్యింది కూడా. అలాగే భారత్‌లో నుస్రత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్‌, మెహ్దీ హాసన్‌లకు గౌరవ సూచికంగా పెద్ద ఎత్తున్న వేడుకలను అక్కడ(భారత్‌) నిర్వహించాం. మరి మీరు(పాక్‌) లతా మంగేష్కర్‌ కోసం ఏదైనా వేడుక నిర్వహించగలిగారా? అని నిలదీయడంతో.. అక్కడున్నవాళ్లంతా చప్పళ్లు చరిచారు. 

జావేద్‌ అక్తర్‌ పాక్‌ ప్రసంగం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఆయనపై చాలామంది అభినందనలు కురిపిస్తున్నారు. ఇక జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలు మాటల తుటాలని.. పాక్‌ గడ్డపై ఆయన చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక జావేద్‌పై ప్రశంసలు గుప్పించిన వాళ్లలో ప్రముఖ నటి కంగనా రౌత్‌ కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు