Jayanagar Election Row: Congress Sowmya Reddy Gets Emotional After Losing By 16 Votes - Sakshi
Sakshi News home page

Jayanagar Election Row: 16 ఓట్లతో గెలుపు తారుమారు..  కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి  

Published Mon, May 15 2023 8:55 AM

Jayanagar Recounting Congress Sowmya Reddy Gets Emotional After loss - Sakshi

30 వేలు, 40 వేల ఓట్లతో ఓడిపోవడం వేరు. రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినప్పుడు అందరితో పాటు ఓటమి పాలైతే పెద్ద బాధ ఉండదు. కానీ అప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్రమంతా హస్తం పవనాలు వీచాయి. ఈ సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి 160 ఓట్లతో గెలిచి హమ్మయ్య అనుకున్నారు. కానీ బీజేపీ డిమాండ్‌తో పదే పదే రీకౌంటింగ్‌ జరిపి చివరకు 16 ఓట్లతో ప్రత్యర్తిని గెలుపు వరించింది. బెంగళూరు జయనగర నియోజకవర్గంలో అతి స్వల్ప ఓట్లు అభ్యర్థుల రాతను తారుమారు చేశాయి. 

బెంగళూరు: ఐటీ సిటీలో జయనగర నియోజకవర్గంలో నాటకీయ పరిణామాల మధ్య విజేత మారిపోయారు. తొలుత ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంతో సంబరాలు మిన్నంటాయి. అంతలోనే బీజేపీ నాయకులు పట్టుబట్టి రీకౌంటింగ్‌ చేయించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి సీకే.రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేవరకూ ఏకధాటిగా హైడ్రామా టెన్షన్‌ పుట్టించింది.  

పోటాపోటీగా రౌండ్లు  
జయనగర ఎస్‌ఎస్‌ఎంఆర్‌వీ కాలేజీ కౌంటింగ్‌ కేంద్రంలో లెక్కింపు ఆరంభమైంది. ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే సౌమ్యారెడ్డి 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ప్రకటించగానే ఆమెతో పాటు కార్యకర్తల సంతోషానికి హద్దుల్లేవు. కానీ ఓట్ల తేడా చాలా  తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్‌ చేయాలని బీజేపీ అభ్యర్థి రామూర్తి డిమాండ్‌ చేయడంతో మళ్లీ రీకౌంటింగ్‌ ప్రారంభించారు.
చదవండి: ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య భేటీ? 

గెలుపు ప్రకటన  
జిల్లా ఎన్నికల అధికారి తుషార్‌ గిరినాథ్‌ రీకౌంటింగ్‌ చేసిన విధానం గురించి నేతలకు వివరించి, సీకే రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. బీజేపీకి 57,797 ఓట్లు, కాంగ్రెస్‌కు 57,781 ఓట్లు వచ్చాయని తెలిపారు.  

కార్యకర్తల ధర్నా  
దీంతో కాంగ్రెస్‌ నేతలు గత్యంతరం లేక ఇంటి ముఖం పట్టారు. గెలుపు దక్కి మళ్లీ ఓటమి పాలు కావడంతో సౌమ్యారెడ్డి విలపించారు. 16 ఓట్ల మెజారిటీతో సీకే రామూర్తి గెలుపు సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌంటింగ్‌లో గోల్‌మాల్‌ జరిగిందంటూ అర్దగంటకు పైగా ధర్నాకు దిగారు. కాగా, ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని సౌమ్యారెడ్డి నిర్ణయించారు.

పదేపదే ఓట్ల లెక్కింపు  
మొదటిసారి నిర్వహించిన రీకౌంటింగ్‌ను ఇద్దరు అభ్యర్థులు ఒప్పుకోలేదు. దీంతో వరుసగా మూడుసార్లు రీకౌంటింగ్‌ చేశారు. ఈ సమయంలో ఓట్ల లెక్కింపు సమయంలో గోల్‌మాల్‌ జరిగిందని కాంగ్రెస్‌ కార్యకర్తలు గొడవకు దిగడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్‌ కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చి పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి, ఎంపీ డీకే.సురేశ్, కేపీసీసీ చీఫ్‌ డీకే.శివకుమార్, ఇక బీజేపీ నేతలు ఆర్‌.అశోక్, ఎంపీ తేజస్విసూర్య మకాం పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement