అయోధ్య‌లో పర్యటించిన విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి | Sakshi
Sakshi News home page

అయోధ్య‌లో పర్యటించిన విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి

Published Tue, Jan 23 2024 10:34 AM

Kanchi Sankaracharya Vijayendra Saraswati Visited Ayodhya - Sakshi

కంచి కామ‌కోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిప‌తి శంక‌రాచార్య విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి అయోధ్య‌లో ప‌ర్య‌టించి యాగ‌శాల‌లో హోమాల‌ను, రామ మందిరంలో ప్రాణ ప్ర‌తిస్ట‌కు సంబంధించిన క్రతువులను ప‌ర్య‌వేక్షించి ఆశీర్వ‌దించారు. అయోధ్య చేరుకున్న స్వామీజీ నేరుగా శ్రీ‌రాముని కుల‌దేవ‌త అయిన దేవ‌కాళి మందిరాన్ని సంద‌ర్శించి పూజ‌లు నిర్వ‌హించి, అనంత‌రం శంక‌ర మ‌ఠాన్ని చేరుకున్నారు. అక్క‌డ ఆయ‌న‌కు భ‌య్యా జోషి ఆహ్వానం ప‌లికారు. అక్క‌డ రామ షడాక్షరి హోమాలు జ‌రిగిన‌ రామ స‌న్నిధిలో ఆయ‌న క‌ల‌శాభిషేకాన్ని నిర్వ‌హించారు. శంక‌ర మ‌ఠంలో రామ‌స‌న్నిధిని శ్రీ జ‌యేంద్ర స‌ర‌స్వ‌తీ మహాస్వామి ప్ర‌తిష్ఠించారు. అనంత‌రం విజ‌యేంద్ర సరస్వతీ స్వామి అయోధ్య శంక‌ర మ‌ఠం వెబ్‌సైట్ www.kanchimuttayodhya.in ప్రారంభించారు.

రామ‌జ‌న్మ భూమికి వెళ్ళిన స్వామివారికి రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్ కోశాధికారి శ్రీ గోవింద్ దేవ్ జీ మ‌హారాజ్‌,  శ్రీ జ్ఞానేశ్వ‌ర్ ద్రావిడ్‌, శ్రీ ల‌క్ష్మీకాంత్ దీక్షిత్‌, ఇత‌ర వైదిక పండితుల‌తో పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. య‌జ్ఞ‌శాల‌లో క‌ల‌య‌దిరిగిన స్వామి అన్ని క‌ల‌శాల‌కు పూల‌ను స‌మ‌ర్పించారు. త‌ర్వాత ప్ర‌ధాన క‌ల‌శానికి మంత్రోచ్ఛార‌ణ‌ల‌తో పూల‌ను స‌మ‌ర్పించి హారతి ఇచ్చారు. శ్రీ‌రాముడిపై ప్ర‌త్యేక మంత్రాల‌ను పూజ్య‌శ్రీ స్వామివారు ఉచ్ఛ‌రించి క‌ల‌శ‌పూజ పూర్తి చేశారు.

అనంత‌రం మందిరానికి బ‌య‌లుదేరిన స్వామివారు ఈ సంద‌ర్భంగా  శ్రీ జ్ఞానేశ్వ‌ర్ శాస్త్రి ద్రావిడ్‌, శ్రీ ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ లు, జరుగనున్న ప్రాణ ప్ర‌తిష్ఠ సంద‌ర్భంగా నిర్వహిస్తున్న ప్ర‌త్యేక క్ర‌తువులు, పూజా విధి విధానాల గురించి వివ‌రించారు. మందిరంలోకి ప్ర‌వేశించే మొద‌టి మెట్టుకు కొబ్బ‌రికాయ‌ను కొట్టి, అనంత‌రం గ‌ణేశుని చెక్కిన మొద‌టి రెండు స్తంభాల‌కు కొబ్బ‌రికాయ‌ల‌ను స‌మ‌ర్పించారు. అనంత‌రం పూజ్య శ్రీ స్వామివారు మ‌హామంట‌పం, అర్ధ మంట‌పం సంద‌ర్శించి, త‌ర్వాత గ‌ర్భ‌గృహానికి వెళ్లారు.
అక్క‌డ ట్ర‌స్టు కోశాధికారి గోవింద్ దేవ్ జీ మ‌హారాజ్‌, కార్య‌ద‌ర్శి చంప‌త్‌రాయ్ ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికారు.

నేత్రోన్మీల‌నం :
గ‌ర్భ‌గుడిలో నేత్రోన్మీల‌నం క్ర‌తువును ప్రారంభించి, విగ్ర‌హానికి న్యాసంతో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి శ్రీ‌రాముడికి ప్ర‌త్యేక ఆభ‌ర‌ణాల‌ను స‌మ‌ర్పించారు. స్వామివారికి అర్థ‌మంట‌పంలో వైదిక మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమ శాలువ‌ను బ‌హుక‌రించారు. స్వామివారు తిరిగి య‌జ్ఞ‌శాల‌కు వెళ్ళారు. ఈ సంద‌ర్భంగా దేశానికి సుర‌క్ష‌, సుభిక్ష, ప్ర‌జ‌ల‌కు సువిద్య  క‌ల‌గాల‌ని ఆశీర్వ‌దించారు.

Advertisement
Advertisement