Karnataka assembly elections 2023: 3 ఉచిత సిలిండర్లు | Sakshi
Sakshi News home page

Karnataka assembly elections 2023: 3 ఉచిత సిలిండర్లు

Published Tue, May 2 2023 5:59 AM

Karnataka assembly elections 2023: JP Nadda releases BJP manifesto - Sakshi

శివాజీనగర: పోలింగ్‌కు పది రోజులే గడువు ఉందనగా కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తే ఏకీకృత పౌర స్మృతి, జాతీయ పౌర పట్టీ అమలుచేస్తామని బీజేపీ ప్రకటించింది. ‘ఏకీకృత పౌరస్మృతి దిశగా మేం నడిచేలా రాజ్యాంగం మాకు దారి చూపింది. ‘అందరికీ న్యాయం. బుజ్జగింపులు లేవిక’ అనేదే మా నినాదం’’ అంటూ ఎన్నికల హామీల చిట్టాను సోమవారం బెంగళూరులో బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా ప్రకటించారు.

‘ఆరు ‘ఏ’లు అంటే ఏ–అన్న(ఆహార భద్రత), ఏ–అక్షర(నాణ్యమైన విద్య), ఏ–ఆరోగ్య(అందుబాటులో ఆరోగ్యం), ఏ–ఆదాయ(ఆదాయ హామీ), ఏ–అభయ(అందరికీ సామాజిక న్యాయం), ఏ–అభివృద్ధి(డెవలప్‌మెంట్‌) ఉండేలా బీజేపీ ప్రజా ప్రణాళికను రూపొందించింది’ అని నడ్డా అన్నారు. మేనిఫెస్టోలో మొత్తంగా 103 వాగ్దానాలు ఉన్నాయి. అభివృద్ధికేంద్రంగా మేనిఫెఫ్టో ఉందంటూ మోదీ కొనియాడారు.

మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు..
► ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రంలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(యూసీసీ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ) అమలు
► దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా 3 ఉచిత వంటగ్యాస్‌ సిలిండర్లు.
► ఈ కుటుంబాలకు ‘పోషణి’ పథకం ద్వారా ఉచితంగా రోజుకు అర లీటరు నందిని పాలు. నెలకు ఐదు కేజీల ‘శ్రీ అన్న– సిరి ధాన్య’.
► రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వార్డులో ‘అటల్‌ ఆహార కేంద్రం’ను నెలకొల్పుతాం. అత్యంత కనిష్ట ధరకే నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం.
► మత ప్రాతిపదికన, ఉగ్రవాద వ్యతిరేక కర్ణాటక విభాగం(కే–ఎస్‌డబ్ల్యూఐఎఫ్‌టీ) ఏర్పాటు.
► రెవిన్యూ శాఖ గుర్తించిన సొంతిల్లులేని వారికి రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్ల స్థలాలు.
► సామాజిక న్యాయ నిధి పేరిట ఎస్సీ/ఎస్టీ వర్గాల గృహిణులకు గరిష్టంగా రూ.10,000 దాకా ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల అవకాశం.
► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రముఖ విద్యావేత్తలు, సంస్థల సౌజన్యంలో విశ్వేశ్వర విద్యా యోజన పథకం
► మిషన్‌ స్వాస్థ్య కర్ణాటక కింద ప్రతీ వార్డులో నమ్మ క్లినిక్‌(మన క్లినిక్‌).
► ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకాల ద్వారా మరో 10 లక్షల ఉద్యోగాల కల్పన.
► సివిల్స్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం.
► కర్ణాటకను ఎలక్ట్రిక్‌ వాహనాల హబ్‌గా మార్చేందుకు చార్జింగ్‌ స్టేషన్ల స్థాపన, వేయి అంకుర సంస్థలకు ప్రోత్సాహం.
► అన్ని గ్రామ పంచాయతీల్లో చిన్న ఎయిర్‌ కండిషన్‌ సదుపాయాలు. వ్యవసాయ ప్రాసెసింగ్‌ కేంద్రాల స్థాపన. ఇందుకోసం రూ.30 వేల కోట్ల అగ్రిఫండ్‌ ఏర్పాటు.


యడియూరప్ప అసంతృప్తి
మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రసంగించాలని మాజీ సీఎం యడియూరప్పను నేతలు కోరగా.. ప్రణాళికను పూర్తిగా చదవ కుండా ప్రసంగం చేయమంటే ఎలాగని ఆయ న అసంతృప్తిని వ్యక్తంచేశారు. ముందుగానే మేనిఫెస్టో కాపీని ఇవ్వాల్సిందని అనడంతో ఆయనలోని అసంతృప్తి బయటపడింది.  

అంతా బోగస్‌: కాంగ్రెస్‌ విమర్శ
‘అబద్ధపు, లూటీల బీజేపీ మేనిఫెస్టో ఇది. అంతా బోగస్‌’ అని బీజేపీ హామీల చిట్టాపై కాంగ్రెస్‌ ఆరోపణలు గుప్పించింది. ‘ మేనిఫెస్టోలో ఉన్న వాటిల్లో 90 శాతం హామీలు 2018లోనే ఇచ్చింది. వీటిని ఇంతవరకు అమలుచేయలేదు. ఇప్పుడు మరో దఫా బోగస్‌ హామీలిస్తోంది’ అని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్వీట్‌చేశారు. ‘ నందిని బ్రాండ్‌ను అమూల్‌లో కలిపేసి కర్ణాటక ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసింది. పెను విమర్శలతో ముఖం చెల్లని బీజేపీ ఇప్పుడు అర లీటర్‌ ఉచితమంటూ ముందుకొచ్చింది.

ఇందిర క్యాంటీన్లను మూసేసిన ఇదే సర్కార్‌ ఇప్పుడు పేరుమార్చి మళ్లీ తెరుస్తానంటోంది. బెంగళూరు బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసి ఇప్పుడు ‘స్టేట్‌ కేపిటల్‌ రీజియన్‌’ అంటూ కొత్తరకం ఫ్యాన్సీ పేర్లతో మభ్యపెడుతోంది. యూపీలో రెండు ఉచిత సిలిండర్లు అన్నారు. ఇంతవరకు దిక్కులేదు. కర్ణాటకలో ఏకంగా మూడు ఇస్తామంటున్నారు’ అని మరో నేత జైరాం రమేశ్‌ ఎద్దేవాచేశారు. 2013–18 కాలంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ రాష్ట్ర సర్కార్‌ 95 శాతం హామీలను నెరవేర్చిందని గుర్తుచేశారు.

Advertisement
Advertisement