కొంచెం తేడా వచ్చినా సీట్లు గల్లంతే.. ఆ మూడు ప్రధాన పార్టీల్లో టెన‍్షన్‌ టెన్షన్‌! | Sakshi
Sakshi News home page

కొంచెం తేడా వచ్చినా సీట్లు గల్లంతే.. ఆ మూడు పార్టీల్లో టెన‍్షన్‌ టెన్షన్‌! ఎవరి ఓటు బ్యాంకుకు గండి పడుతుందో?

Published Wed, Apr 12 2023 5:38 AM

Karnataka polls getting tougher, more seats now being decided by thin margins - Sakshi

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోరులో మెజార్టీ అనేది ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ చిన్న పార్టీల జోరు పెరిగిపోతూ ఉండడంతో అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కడం పరిపాటిగా మారింది. దాంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటునూ ఒడిసిపట్టడం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లకు కీలకంగా మారింది...

అధికార వ్యతిరేకత, చిన్న పార్టీల జోరు ఈ రెండూ కర్ణాటక ఎన్నికల ఫలితాల్ని శాసిస్తున్నాయి. వరసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారాన్ని కట్టబెట్టే సంప్రదాయం లేని కన్నడ నేలపై అత్యంత తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలవడం సాధారణంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 16 స్థానాల్లో విజేతలు 3 వేల కంటే తక్కువ మార్జిన్‌తో గట్టెక్కారు.

గత ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 36% ఓట్లతో 104 స్థానాల్లో విజయం సాధిస్తే, 38% ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ మాత్రం 80 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది! మన ప్రజాస్వామ్యంలోని ఈ వైచిత్రి కారణంగా అత్యధిక ఓట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే సవాల్‌గా మారింది. అందుకే ఈసారి పార్టీలన్నీ ఒక్క ఓటు కూడా పోకుండా క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తూ బూత్‌ మేనేజ్‌మెంట్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి.

మూడు ఎన్నికల ముచ్చట
గత మూడు ఎన్నికల్లోనూ అన్ని పార్టీలకు స్వల్ప మార్జిన్‌ పెద్ద తలనొప్పిగా మారింది. 2008 ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 70 స్థానాల్లో ఎమ్మెల్యేలు 5 శాతం కంటే తక్కువ మార్జిన్‌తో గెలుపొందారు. అంటే 31% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొన్నట్టయింది. 2013 ఎన్నికల దగ్గరకి వస్తే 5 శాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపొందిన స్థానాల శాతం 30గా ఉంది.

గత ఎన్నికల్లో 28% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొంది. గత మూడు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీ, జేడీ(ఎస్‌) పార్టీల సగటు గెలుపు ఆధిక్యం 12 శాతం ఉండగా, కాంగ్రెస్‌కు 11 శాతం ఉంది. 1980ల వరకు ఏ రాష్ట్రంలోనైనా గెలుపు ఆధిక్యాలు చాలా ఎక్కువగా దాదాపుగా 30% అంతకంటే ఎక్కువ ఓట్లు ఉండేవి. తర్వాత ప్రాంతీయ పార్టీలు పెరగడం, పార్టీల సామాజిక సమీకరణలు వంటివి ప్రధానంగా మారి ఓట్ల ఆధిక్యానికి అడ్డుకట్ట వేస్తున్నాయి.

పార్టీల్లో టెన్షన్‌ టెన్షన్‌  
ఈసారి ఎవరి ఓటు బ్యాంకుకి గండిపడుతుందా అని మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్‌ మొదలైంది. మొత్తం 224 స్థానాలకు గాను అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన మజ్లిస్‌ 25 స్థానాల్లో పోటీ చేయనుంది. సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా 100 స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేస్తోంది. వీటితో కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లకు నష్టమనే అంచనాలున్నాయి. బీజేపీని వీడిన గాలి జనార్దన రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు.

ఆప్‌ అన్ని స్థానాల్లోనూ పోటీ పడుతోంది. ఈ పార్టీల ప్రభావం గత ఎన్నికల్లో 5 వేల కంటే తక్కువ మెజారిటీ నమోదైన 30 సీట్లపై ఉంటుందని భావిస్తున్నారు. ‘‘ఏదైనా నియోజకవర్గంలో హోరాహోరి పోరు నెలకొన్నప్పుడు చిన్న పార్టీలు రెండు నుంచి మూడు వేలు ఓట్లు సంపాదించినా అది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఎన్నికల్లో గెలవలేకపోయినా ఫలితాలను మార్చే సత్తా కలిగి ఉంటారు’’అని బెంగుళూరుకి చెందిన రాజకీయ విశ్లేషకుడు నరేంద్రపాణి అభిప్రాయపడ్డారు.

నోటాకే ఎక్కువ ఓట్లు!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే నోటా (నన్‌ ఆఫ్‌ ది ఎబౌ)కే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. వాటిలో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెసే నెగ్గింది. అలంద్, బాదామి, గడగ్, హిరెకెరూర్, కంగ్‌డోల్, మాస్కి, పావగడలో అభ్యర్థుల గెలుపులో ఓట్ల కంటే నోటాకే ఎక్కువ పడ్డాయి.

► 1985 నుంచి ఇప్పటివరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అత్యధిక స్థానాల్లో బొటాబొటి మెజార్టీతోనే నేతలు గట్టెక్కారు.

► 25 శాతానికి పైగా స్థానాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. విజేతలకు, పరాజితులకు మధ్య తేడా 5, అంతకంటే తక్కువ శాతమే ఉంది.

► గత మూడు దశాబ్దాల్లో కేవలం 5 శాతం స్థానాల్లో మాత్రమే భారీ మెజార్టీ నమోదైంది.

► విజేతలు, పరాజితులకు వచ్చిన ఓట్లు, వాటి మధ్య తేడాలను విశ్లేషిస్తే ఓటరు గాలివాటంగా పోకుండా ఎంతో మేధోమథనం చేసి ఓటేస్తున్నాడని తేటతెల్లమవుతుంది.

 ► మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులిద్దరికీ ఓట్లు 5 శాతం తేడా వస్తే హోరాహోరీగా పోరు సాగిందని, 20 శాతం కంటే ఎక్కువ ఉంటే ఓటరు నిర్ణయాత్మకంగా స్పందించారని అంటారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement