మెడిసినా.. లైట్‌ తీసుకో ఇప్పుడొద్దు! | Sakshi
Sakshi News home page

మెడిసినా.. లైట్‌ తీసుకో ఇప్పుడొద్దు!

Published Fri, Jun 17 2022 1:51 PM

Karnataka: Students Not Showing Interest In Medical Seats Neet Admission - Sakshi

సాక్షి బెంగళూరు: మెడికల్‌ సీట్లంటే ఎంత క్రేజో చెప్పవలసిన పని లేదు. కానీ ఇప్పుడు ముఖచిత్రం మారింది. రాష్ట్రంలో వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌లో చుక్కెదురవుతోంది. ఇప్పటికే నాలుగురౌండ్ల కౌన్సెలింగ్‌ ముగిసింది. అయినప్పటికీ సీట్లు పూర్తిగా భర్తీ కాలేదు. ప్రభుత్వ కోటా సీట్లపై కూడా విద్యార్థులు నిరాసక్తత చూపుతున్నారు.   

కారణాలేమిటి  
► గతంలో మెడిసిన్‌ సీట్లకు రాష్ట్రంలో భారీ డిమాండ్‌ ఉండేది. ఇక్కడ సీట్లు లభించని వారు విదేశాలకు వెళ్లి చదువుకునేవారు. ఎంతో ప్రతిభావంతులైనప్పటికీ వైద్య సీటు పొందాలంటే చాలా కష్టంగా ఉండేది. పోటీ అంత తీవ్రంగా ఉండేది.  
► అయితే గతేడాది కోవిడ్‌ కారణంగా నీట్‌ పరీక్ష ఆలస్యంగా జరిగింది. సీట్ల పంపిణీ సమయానికి విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్సుల ప్రారంభం మరింత జాప్యం జరిగింది.  
►  రాష్ట్రంలో 14,305 సీట్లు ఉండగా ఇందులో ఇంకా 2,800 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో దంతవైద్య సీట్లు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది కోవిడ్‌తో పాటు వివిధ కారణాల వల్ల విద్యార్థులకు వైద్య విద్యపై ఆసక్తి సన్నగిల్లింది. భారీగా పెరిగిన ఫీజులు, కోవిడ్‌ వల్ల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు ఈ దుస్థికి కారణమని తెలుస్తోంది.

భయపెడుతున్న ఫీజుల భారం  
► ప్రతి ఏటా మెడికల్‌ కాలేజీల్లో 30 శాతం ఫీజు పెంపు జరిగేది. ప్రభుత్వ కోటాలో సీటు పొందినప్పటికీ లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మెడిసిన్‌ సీటు పొందడం జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు భారంగా మారింది. ఇతర వర్గాలవారూ లక్షల్లో ఫీజులను కట్టలేక వేరే కోర్సులను చూసుకుంటున్నారు.  
► ఇక డెంటల్‌ కోర్సు పూర్తి చేసి సొంతంగా క్లినిక్‌ ప్రారంభించినా చదువుకు పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో డెంటల్‌ కోర్సు దండగని చాలామంది భావిస్తున్నారు. 

Advertisement
Advertisement