భారత్‌ను ముక్కలు చేసేందుకు ప్లాన్‌.. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా..

25 Sep, 2023 19:55 IST|Sakshi

ఢిల్లీ: ఇటీవలి కాలంలో కెనడా-భారత్‌ మధ్య ఖలిస్థానీ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో కెనడాలో ఉంటున్న హిందువులను తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) నివేదికలో షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్‌.. భారత్‌ను విజజింజే కుట్ర చేసినట్టు ఎన్‌ఐఏ పేర్కొంది. 

దేశ విభజనకు బిగ్‌ ప్లాన్‌..
వివరాల ప్రకారం..  ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు సంబంధించిన కొన్ని విషయాలను ఎన్‌ఐఏ వెల్లడించింది. ఇందులో భాగంగా అతడు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి, ఎన్నో దేశాలు ఏర్పాటు చేయాలని భారీ కుట్ర పన్నినట్టు ఓ నివేదిక తెలిపింది. భారతదేశ ఐక్యత, సమగ్రతను అతడు సవాల్ చేసినట్టు.. ఆడియో మెసేజ్‌ల ద్వారా అధికారులు గుర్తించారు. కశ్మీర్ ప్రజల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని, వారి కోసం ఒక ముస్లిం దేశం సృష్టించాలని, దానికి ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్’ అనే పేరు పెట్టాలని పన్నూన్‌ కుట్ర పట్టిన్నట్టు నివేదికలో వెల్లడించింది. 

ఎన్‌ఐఏ సంచలన నివేదిక..
ఎన్‌ఐఏ రిపోర్టు ప్రకారం.. ఇండియా గేట్ వద్ద ఖలిస్తానీ జెండాను ఎగురవేసేవారికి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ 2.5 మిలియన్ల అమెరికా డాలర్ల బహుమతిని ఆఫర్ చేశాడు. 2021లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటలో భారత జెండాను ఎగురవేయకుండా ఆపిన పోలీసు సిబ్బందికి అతను ఒక మిలియన్‌ అమెరికా డాలర్లను కూడా ఆఫర్ చేసినట్లు నివేదికలో స్పష్టమైంది. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలోని ప్రముఖ ప్రదేశాలలో ఖలిస్తానీ పోస్టర్లు, జెండాలను అమర్చడానికి అతను చాలాసార్లు ప్రయత్నించాడని పేర్కొంది. 

భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..
ఇదిలా ఉండగా.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్‌ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే భారత్‌ అతడికి స్ట్రాంగ్‌ కౌంటర్చింది. పన్నూన్‌ వార్నింగ్‌ వీడియోను భారత్‌ తీవ్రంగా పరిగణించింది. అనంతరం.. అమృత్‌సర్‌ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్‌ఐఏ సీజ్‌ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్‌ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్‌ సెల్‌ గ్రూపుల ద్వారా గురపత్వంత్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్‌ఐఏ చర్యతో  పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్‌ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఇవి పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అలాగే హర్యానా, ఉత్తరాఖండ్‌లలో నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్‌.. ఎన్‌డీఏకు అన్నాడీఎంకే గుడ్‌బై..

మరిన్ని వార్తలు