కవితకు రిమాండ్, 7 రోజుల కస్టడీ | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాం కేసు: ఎమ్మెల్సీ కవితకు రిమాండ్‌.. 7 రోజుల ఈడీ కస్టడీ

Published Sat, Mar 16 2024 5:10 PM

Liquor Case: Delhi Court Remand BRS MLC Kavitha ED Custody Details - Sakshi

ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు

కవిత భర్త అనిల్‌ సహా ముగ్గురికి ఈడీ నోటీసులు

సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశం

అనిల్ ఫోన్లను ఇప్పటికే సీజ్ చేసిన ఈడి

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్‌ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్‌ విధిస్తూ..  ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు,  న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది.

ఫామ్ హౌజ్‌కు కేసీఆర్‌

ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, ఆపై కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించిన పరిణామాల అనంతరం ఆమె తండ్రి, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌కు వెళ్లిపోయారు. అయితే కవిత అరెస్టుపై ఇప్పటివరకూ కేసీఆర్‌ స్పందించలేదు. 

కవిత భర్తకు కూడా నోటీసులు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ అనూహ్యంగా మరో అడుగు ముందుకేసింది. కవిత భర్త అనిల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అనిల్ ఫోన్లను సీజ్ చేసింది ఈడీ.

కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? 

  • ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు
  • సౌత్‌ లాబీ పేరుతో లిక్కర్‌ స్కాంలో కీలకంగా వ్యవహరించారు
  • ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే
  • ఆమ్‌ అద్మీ పార్టీకి కవిత లిక్కర్‌ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు
  • మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు
  • కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు
  • పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు
  • అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు
  • ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు
  • కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు
  • సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు
  • మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు
  • రూ. 30 కోట్లను అభిషేక్‌ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది.

మరోవైపు కవిత అరెస్టును ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు సీఎం రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయడానికే రాజకీయ డ్రామా చేశారని, కవిత అరెస్టుపై ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని, ఈడీ ఒకేరోజు హైదరాబాద్‌ వచ్చారని, ఈ కేసులో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని అడిగారు. కవిత అరెస్టుతో బీఆర్‌ఎస్‌ సానుభూతి, అవినీతిని సహించేది లేదంటూ బీజేపీ ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement