లిక్కర్‌ స్కాం: ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాం: ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Published Wed, Feb 22 2023 2:24 PM

Liquor Scam: Delhi High Court Notices To ED - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లిక్కర్‌ కేసులో ఢిల్లీ హైకోర్టులో ఇవాళ(బుధవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఈడీ అరెస్ట్‌ చేసిన ఐదుగురిలో బినోయ్‌ బాబు ఒకరు. ఆయన బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి ఈడీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. 

పెర్నోడ్‌ రికార్డ్‌ అనే లిక్కర్‌ కంపెనీలో బినోయ్ జనరల్‌ మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే.. లిక్కర్‌ స్కాంకు సంబంధించి కిందటి ఏడాది నవంబర్‌లో ఈడీ ఆయన్ని అరెస్ట్‌ చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన ఢిల్లీ ట్రయల్‌ కోర్టు(రౌస్‌ ఎవెన్యూ కోర్టు) బినోయ్‌ బాబుతో సహా నిందితులందరి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. వాళ్లు తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినట్లు, కేసు తీవ్రత దృష్ట్యా ఈ దశలో బెయిల్‌ మంజూరు చేయడం కుదరని పేర్కొంది. ఈ తరుణంలో బినోయ్‌.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 

దీంతో జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ చేపట్టింది. బినోయ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు ఇవాళ వినిపించారు. మద్యం పాలసీ విధానంలో బినోయ్‌ ఎలాంటి పాత్ర పోషించలేదని, పైగా సీబీఐ ఆయన్ని ప్రత్యక్ష సాక్షిగా మాత్రమే పేర్కొందన్న విషయాన్ని ఆయన బెంచ్‌కు వినిపించారు. ఈడీ దురుద్దేశపూర్వకంగానే ఆయనపై అభియోగాలు నమోదు చేసిందని వాదించారు లాయర్‌ రోహత్గి. దీంతో స్పందించాల్సిందిగా ఈడీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈడీ సైతం తమ అభియోగాలకు బలపర్చే సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టుకు విన్నవించింది. ఈ తరుణంలో ఈ పిటిషన్‌పై  తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

Advertisement
Advertisement