సుప్రీం కోర్టులో కవితకు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో కల్వకుంట్ల కవితకు చుక్కెదురు

Published Fri, Mar 22 2024 10:53 AM

Liquor Scam: No Relief For Kavitha In Supreme Court  - Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ కేసులో అరెస్టై.. ఊరట కోసం ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కెదురైంది. సుప్రీం కోర్టు శుక్రవారం ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ చేయలేమన్న సుప్రీం.. రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండబోదని, ట్రయల్‌ ఎదుర్కొని తీరాల్సిందేనని స్పష్టం చేసింది. 

‘‘చట్టం అందరికీ ఒకటే, రాజకీయ నాయకులైనంత ప్రత్యేక విచారణ ఇక్కడ జరపలేం. రిట్ పిటిషన్ లో  లేవనెత్తి అంశాలను విజయ్ మదన్ లాల్  కేసుతో కలిపి విచారణ జరపుతాం. ఈ కేసులో పిటిషనర్‌(కవిత) ట్రయల్ ఎదుర్కొని తీరాల్సిందే’ అని జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్ , జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే కవిత వేసిన రిట్‌ పిటిషన్‌కు సంబంధించి.. ఆరు వారాల్లో కౌంటర్‌ ఫైల్‌ చేయాలని ఈడీకి సుప్రీం నోటీసులు జారీ చేసింది.

అలాగే.. బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టులోనే పిటిషన్‌ వేయాలని కవిత తరఫు న్యాయవాదికి సుప్రీం ధర్మాసనం సూచించింది. అదే సమయంలో మహిళ కాబట్టి ట్రయల్‌ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను అరెస్ట్‌ చేశాక ఈడీ నేరుగా ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కోర్టు ఆమెకు రిమాండ్‌ విధించడంతో పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను.. ఈ నెల 23వ తేదీన ఆమెను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాల్సి  ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు సుప్రీం కోర్టు చేసిన సూచనతో కవిత తిరిగి రౌస్ అవెన్యూ కోర్టులోనే పిటిషన్‌ వేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement