లాక్‌డౌన్‌ పొడిగింపు.. ఆంక్షలు కఠినతరం 

23 May, 2021 01:29 IST|Sakshi

కరోనా కట్టడికి రాష్ట్రాల వ్యూహం  

న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు కొంత తగ్గుముఖం పడుతూ రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ.. ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు కరోనా సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో వారం రోజులపాటు పొడిగించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూను మే 31 ఉదయం 7 గంటల దాకా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఇప్పటికే పొడిగించారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అందుకే లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించక తప్పదని ఆయా రాష్ట్రాలు నిర్ణయించాయి.  


రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు 
తమిళనాడులో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ఈ నెల 24న ముగిసిపోవాల్సి ఉండగా, కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. 
దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 24 దాకా లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. లాక్‌డౌన్‌ పెట్టి నాలుగువారాలవుతోంది.  
హరియాణాలో మే 3 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. దీన్ని మే 24 దాకా పొడిగించారు. 
చండీగఢ్‌లో వారాంతపు కర్ఫ్యూ ఆంక్షలను మే 25 దాకా కొనసాగించాలని నిర్ణయించారు. 
పంజాబ్‌లో కోవిడ్‌–19 ఆంక్షలను మే 31 దాకా పొడిగించారు. రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 
బిహార్‌లో తొలుత మే 4న లాక్‌డౌన్‌ విధించారు. మే 15 దాకా కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పుడు మే 25 వరకూ పొడిగించారు. 
జార్ఖండ్‌లో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను మే 27 దాకా కొనసాగించనున్నారు. 
ఒడిశాలో జూన్‌ 1 దాకా లాక్‌డౌన్‌ ఉంటుంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. 
మే 16 నుంచి 30 దాకా తమ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతుందని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. 
రాజస్తాన్‌లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నెల 24 దాకా ఆంక్షలుంటాయి. 
మధ్యప్రదేశ్‌లో 52 జిల్లాల్లో కరోనా కర్ఫ్యూను మే 31 దాకా పొడిగించారు. 
గుజరాత్‌లో 36 నగరాలు/పట్టణాల్లో రాత్రి పూట కర్ఫ్యూను మే 28 వరకూ ఉంటుంది. దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పని చేస్తున్నాయి. 
చత్తీస్‌గఢ్‌లోని అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగించారు. 
కేరళలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ మే 23న ముగియాల్సి ఉండగా, మే 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
కర్ణాటకలో లాక్‌డౌన్‌ను ఏకంగా రెండు వారాలపాటు పొడిగించారు. మే 24 నుంచి జూన్‌ 7వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. 
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 30 దాకా పొడిగించారు. 
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించారు. 
గోవాలో మే 31 దాకా కర్ఫ్యూ విధించారు. 
మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను జూన్‌ 1వ తేదీ వరకూ పొడిగించింది. 
అస్సాంలో ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. 
నాగాలాండ్, మిజోరాంలో లాక్‌డౌన్‌ను 31 వరకూ పొడిగించారు. 
అరుణాచల్‌ప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను మే 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది. 
మణిపూర్‌లో ఏడు జిల్లాల్లో మే 28 వరకూ కర్ఫ్యూ విధించారు. 
మేఘాలయాలోని ఈస్టుకాశీ జిల్లాలో లాక్‌డౌన్‌ ను మే 31వ తేదీ దాకా పొడిగించారు. 
త్రిపురలో ఈ నెల 26 వరకూ నైట్‌ కర్ఫ్యూ అమలు కానుంది. 
సిక్కింలో ఈ నెల 24 దాకా లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. 
జమ్మూకశ్మీర్‌లో ఈ నెల 24 దాకా కర్ఫ్యూను పొడిగించారు. 
ఉత్తరాఖండ్‌లో మే 25 ఉదయం వరకూ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. 
హిమాచల్‌ప్రదేశ్‌లో కర్ఫ్యూను మే 26 దాకా పొడిగించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు