Lok sabha elections 2024: బరిలో కుబేరులు | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: బరిలో కుబేరులు

Published Thu, Apr 11 2024 6:06 AM

Lok sabha elections 2024: 450 of the first phase candidates are millionaires - Sakshi

తొలి దశ అభ్యర్థుల్లో 450 మంది కోటీశ్వరులు

రూ.717 కోట్లతో తొలి స్థానంలో కాంగ్రెస్‌ నేత నకుల్‌నాథ్‌

లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్న వారిలో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రధాన పార్టీల టికెట్లు దక్కించుకునేందుకు ధనబలం కూడా ప్రాతిపదికగా మారుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తొలి విడతలో బరిలో ఉన్న 1,625 మంది అభ్యర్థుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులేనని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది.

బీజేపీ నుంచే ఎక్కువ...
తొలి విడతలో మొత్తం 1,625 మంది అభ్యర్థుల్లో 450 మందికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ ఆస్తులున్నాయి. జాబితాలో బీజేపీ నుంచి అత్యధికంగా 69 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్‌ (49 మంది), అన్నాడీఎంకే (35), డీఎంకే (21), బీఎస్‌పీ (18), టీఎంసీ (4), ఆర్జేడీ (4 మంది) ఉన్నాయి. అభ్యర్థుల సగటు ఆస్తులపరంగా అన్నాడీఎంకే టాప్‌లో ఉంది. ఈ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరికి సగటున రూ.35.61 కోట్ల ఆస్తులున్నాయి.

తొలి దశ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ నిలిచారు. అఫిడవిట్లో వెల్లడించిన ఆయన ఆస్తుల విలువ రూ.717 కోట్లు. ఛింద్వారా సిటింగ్‌ ఎంపీ అయిన ఆయన ఈసారి కూడా అక్కడినుంచే కాంగ్రెస్‌ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. రెండో స్థానంలో తమిళనాడులోని ఈరోడ్‌ అభ్యర్థి అశోక్‌ కుమార్‌ ఉన్నారు. ఈ అన్నాడీఎంకే నేత తనకు రూ.662 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. 10 మంది స్వతంత్ర అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులూ లేవని ప్రకటించడం విశేషం!

93 మంది నేరచరితులు
తొలి విడతలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య కూడా ఎక్కువే. జాబితాలో బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్‌ నుంచి 19 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో డీఎంకే (13), అన్నాడీఎంకే (13), బీఎస్పీ (11), ఆర్జేడీ (4), ఎస్పీ (3), టీఎంసీ (2) ఉన్నాయి. వీరిలో బీజేపీ నుంచి 14 మందిపై తీవ్ర నేరపూరిత కేసులున్నాయి. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్‌ (8), బీఎస్పీ (8), డీఎంకే (6), అన్నాడీఎంకే (6), ఆర్జేడీ (2), ఎస్పీ (2), టీఎంసీ (1) ఉన్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement