Lok Sabha elections 2024: వారణాసి నుంచే... మళ్లీ మోదీ | Lok Sabha Elections 2024: BJP First List Of 195 Candidates Is Out, Check Details Inside - Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: వారణాసి నుంచే... మళ్లీ మోదీ

Published Sun, Mar 3 2024 5:49 AM

Lok Sabha elections 2024: BJP first list of 195 candidates is out - Sakshi

బీజేపీ లోక్‌సభ ఎన్నికల సమరభేరి

195 మందితో తొలి జాబితా విడుదల

గాం«దీనగర్‌ నుంచి షా, లక్నో నుంచి రాజ్‌నాథ్‌

మొత్తం 34 మంది కేంద్ర మంత్రులకు చోటు

లోక్‌సభ బరిలో మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌

తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

జాబితాలో 28 మంది మహిళలకు చోటు

20 శాతం మంది సిట్టింగులకు మొండిచేయి

కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి, హర్షవర్ధన్‌కు నో టికెట్‌

వివాదాస్పద ఎంపీలు ప్రజ్ఞాసింగ్, బిధురికి కూడా

లేఖి స్థానంలో సుష్మా స్వరాజ్‌ కూతురు బాసురి

సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ లోక్‌సభ సమర శంఖం పూరించింది. విపక్ష ఇండియా కూటమి ఇంకా పొత్తుల ఖరారు ప్రయత్నాల్లో ఉండగానే, ఎన్నికల షెడ్యూలైనా రాకముందే ఏకంగా 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది! ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేయనున్నారు.

ఈసారి మరింత బంపర్‌ మెజారిటీతో ఆయన ఘనవిజయం సాధిస్తారని తావ్డే ధీమా వెలిబుచ్చారు. పలు రాష్ట్రాల్లో మరింతగా చొచ్చుకుపోయి ఎన్డీఏ కూటమిని ఇంకా బలోపేతం చేయడమే లక్ష్యంగా జాబితాను రూపొందించినట్టు ఆయన వెల్లడించారు.

ఇక గుజరాత్‌లోని గాం«దీనగర్‌ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్‌ సింగ్, రాజస్థాన్‌లోని కోటా నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా బరిలో దిగుతున్నారు. యూపీలో కాంగ్రెస్‌ కంచుకోట అమేథీలో 2019లో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాం«దీని మట్టికరిపించి సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అప్పట్లో రెండుచోట్ల పోటీ చేసిన రాహుల్‌ వాయనాడ్‌ నుంచి నెగ్గారు.

తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు చోటు దక్కింది. మన్‌సుఖ్‌ మాండవీయ (పోరుబందర్‌), భూపీందర్‌ యాదవ్‌ (ఆళ్వార్‌), శర్బానంద సోనోవాల్‌ (దిబ్రూగఢ్‌), గజేంద్రసింగ్‌ షెకావత్‌ (జోధ్‌పూర్‌), అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ (బికనేర్‌), జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌), కిరణ్‌ రిజిజు (అరుణాచల్‌ వెస్ట్‌), రాజీవ్‌ చంద్రశేఖర్‌ (తిరువనంతపురం), అర్జున్‌ ముండా (కుంతీ), జ్యోతిరాదిత్య సింధియా (గుణ) తదితరులు వీరిలో ఉన్నారు. టికెట్‌ దక్కిన మంత్రుల్లో ఏడుగురు రాజ్యసభ సభ్యులు కావడం విశేషం. తొలి జాబితాలోనే ఏకంగా మూడో వంతుకు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బీజేపీ దూకుడు కనబరచడమే గాక కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఢిల్లీలో నలుగురి మార్పు
దేశ రాజధాని ఢిల్లీని ఈసారి బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అక్కడి ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పారీ్టకి ఈసారి కూడా ఏ అవకాశమూ ఇవ్వొద్దని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో భాగంగా ఢిల్లీలో ప్రకటించిన ఐదు స్థానాల్లో ఏకంగా నాలుగింట సిట్టింగులను పక్కన పెట్టడం విశేషం! వారిలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్, పరేశ్‌ వర్మతో పాటు బీఎస్పీ ఎంపీపై మతపరమైన వ్యాఖ్యలతో పెను వివాదానికి తెర తీసిన రమేశ్‌ బిధూరి ఉన్నారు.

మనోజ్‌ తివారీ మాత్రమే ఈశాన్య ఢిల్లీ నుంచి మళ్లీ బరిలో దిగుతున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి లేఖి బదులుగా దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ కూతురు బాసురీ పోటీ చేయనుండటం విశేషం. ఇక భోపాల్‌ నుంచి వివాదాస్పద ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌లకు మొండిచేయి చూపారు. ఆమె స్థానంలో అలోక్‌ శర్మకు చాన్స్‌ దక్కింది. మరో కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలీకి కూడా టికెట్‌ దక్కలేదు.

పుష్కలంగా గ్లామర్‌
సినీ నటులకు తొలి జాబితాలో బాగానే చోటు దక్కింది. భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్‌ సింగ్‌ పశి్చమ బెంగాల్లోని అసన్‌సోల్‌ నుంచి బరిలో దిగుతున్నారు. సిట్టింగులు హేమమాలిని (మథుర), రవికిషన్, మహేశ్‌శర్మ, బఘేల్, సాక్షి మహారాజ్‌కు చాన్స్‌ దక్కింది.

ఇద్దరు మాజీ సీఎంలు
బీజేపీ తొలి జాబితాలో ఇద్దరు మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విదిశ స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘనవిజయం సాధించినా అధినాయకత్వం ఆయన్ను సీఎంగా కొనసాగించలేదు. ఇక త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్‌ త్రిపుర వెస్ట్‌ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాకు ఖేరి నుంచి మళ్లీ అవకాశమివ్వడం విశేషం. ఆయన కుమారుడు ఆశిష్‌పై 2021లో యూపీలోని లఖీంపూర్‌ ఖేరీలో రైతులపైకి కారు పోనిచ్చి నలుగురిని పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపణలున్నాయి.

యూపీ నుంచి 51 మంది  
బీజేపీకి అత్యంతకీలకమైన ఉత్తరప్రదేశ్‌కు తొలి జాబితాలో అగ్రతాంబూలం దక్కింది. 195లో యూపీ నుంచి 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2019లో యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గింది. మధ్యప్రదేశ్‌లో 24, పశి్చమ బెంగాల్‌లో 20, గుజరాత్, రాజస్తాన్ల నుంచి 15 చొప్పున, కేరళ నుంచి 12, అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ నుంచి 11 చొప్పున, తెలంగాణ నుంచి 9, ఢిల్లీ నుంచి 5, ఉత్తరాఖండ్‌ నుంచి 3, అరుణాచల్‌ప్రదేశ్, జమ్మూ కశీ్మర్‌ నుంచి రెండేసి సీట్లతో పాటు గోవా, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులు, డామన్‌ డయ్యూ స్థానాలకు కూడా అభ్యర్థుల వెల్లడి జరిగింది. 195 మందిలో 28 మంది మహిళలు, 57 మంది ఓబీసీలు, 27 మంది ఎస్సీలు, 18 మంది ఎస్టీలకు స్థానం లభించింది. 47 స్థానాల్లో 50 ఏళ్ల లోపువారికి అవకాశం కల్పించారు.

సుదీర్ఘ చర్చల తర్వాతే...
తొలి జాబితా రూపకల్పన కోసం బీజేపీ భారీ కసరత్తే చేసింది. ప్రకటనకు ముందు గురువారం రాత్రి పొద్దుపోయేదాకా మోదీ సారథ్యంలో అగ్ర నాయకత్వం సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిపింది. సిట్టింగుల పనితీరుపై నిశిత పరిశీలన, కొంతకాలంగా జరిపిన పలు లోతైన సర్వేలతో పాటు నమో యాప్‌ తదితర వివరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు చెబుతున్నారు. తొలి జాబితాలో ప్రకటించిన 195 స్థానాల్లో 155 చోట్ల 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఆ 155 మంది సిట్టింగుల్లో ఏకంగా 20 శాతం మందికి ఈసారి టికెట్లివ్వకపోవడం విశేషం! ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370కి పైగా, ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు స్థానాల్లో నెగ్గాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement