Lok sabha elections 2024: ఆ మూడ్‌ స్వింగ్‌ ఎటో! | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: ఆ మూడ్‌ స్వింగ్‌ ఎటో!

Published Sat, Apr 13 2024 5:22 AM

Lok sabha elections 2024: Lok Sabha polls: 3 swing states could decide India fate - Sakshi

కీలకంగా మారిన బిహార్, బెంగాల్, మహారాష్ట్ర

ఎవరికీ అందని ఓటర్ల నాడి

ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేసే చాన్స్‌

దేశంలో మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదని, ఫలితంగా వరుసగా మూడో ఘనవిజయంతో బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే కీలక రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్రల్లో మాత్రం ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు.

దాంతో వాటిని ఈసారి ఎన్నికల ఫలితాలను నిర్దేశించగల స్వింగ్‌ స్టేట్లుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ మూడు రాష్ట్రాలూ కలిపి ఏకంగా నాలుగో వంతు ఎంపీలను లోక్‌సభకు పంపుతున్నాయి! వాటిని నిర్ణాయక రాష్ట్రాలుగా మారుస్తున్న కారకాలేమిటి? అక్కడ ఫలితాలను ఊహించడం ఎందుకింత కష్టసాధ్యంగా మారింది...?

అమెరికాలో 7 రాష్ట్రాలను స్వింగ్‌ స్టేట్స్‌గా పేర్కొంటారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రతిసారీ అవే నిర్ణయిస్తుంటాయి. ఎన్డీఏ 400 సీట్లు దాటాలన్న లక్ష్యాన్ని దాటుతుందో లేదో బెంగాల్, బిహార్, మహారాష్ట్ర ఫలితాలు నిర్ణయించనున్నాయి. బెంగాల్లో టీఎంసీ,బీజేపీ మధ్య పోరు నెలకొంది.

బిహార్లో రాజకీయ పునరేకీకరణతో సమీకరణాలు మారాయి. మహారాష్ట్రలో రెండు పెద్ద పార్టీలు నిలువునా చీలి రెండో ఎన్డీఏలో, మరో రెండు విపక్ష ఇండియా కూటముల్లో చేరి ఎదురెదురుగా మోహరించాయి. దాంతో 130 ఎంపీ సీట్లున్న ఈ 3 రాష్ట్రాల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.  

బెంగాల్లో బీజేపీ పాచిక పారేనా...?
2019 లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో బీజేపీ పాగా వేసిన తీరు ఆసక్తికరం. మోదీ మేనియాకు పౌరసత్వ అంశం తదితరాలు తోడవడంతో 42 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 18 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. 2014లో 17 శాతమున్న ఓటు శాతాన్ని 40 శాతానికి పెంచుకోగలిగింది.  ఈసారి పరిస్థితి ఎలా ఉండనందన్నది అంచనాలకు అందడం లేదు. కాకపోతే ప్రతి స్థానంలోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కన్పిస్తోంది.

ప్రధాని మోదీ ఇంకా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టలేదు. ఆయన ఏయే అంశాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తారన్నది కూడా ఆసక్తికరం. వాటిని బట్టి రాష్ట్రంలో ఓటర్ల మూడ్‌ మారిపోయే ఆస్కారముంది. అయితే బెంగాల్లో ఈసారి బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చెబుతుండటం ఆసక్తికరం. మిగతా విశ్లేషకులు మాత్రం బీజేపీకి ఈసారి ఓట్లశాతం మరింత పెరగవచ్చంటూనే, అది సీట్ల సంఖ్యలో ప్రతిఫలిస్తుందో లేదో చూడాలని చెబుతుండటం విశేషం.

పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడం తదితరాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్న ముస్లింల ఓట్లు పూర్తిగా టీఎంసీ వైపు మళ్లినట్టేనని వారంటున్నారు. ఇది మా పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి అతి పెద్ద సానుకూలాంశంగా కన్పిస్తోంది.

‘‘దీనికి తోడు యూపీ వంటి రాష్ట్రాల మాదిరిగా బెంగాల్లో బీజేపీకి పటిష్టమైన సంస్థాగత నిర్మాణం లేదు. పైగా రాష్ట్ర పార్టీలో సువేందు అధికారి, దిలీప్‌ ఘోష్, సుకాంతో మజుందార్‌ మధ్య ఆధిపత్య పోరు పుట్టి ముంచేలా కన్పిస్తోంది’’ అని సీనియర్‌ జర్నలిస్టు జయంత ఘోషా  అభిప్రాయపడ్డారు. తృణమూల్‌ తన 22 స్థానాలను నిలుపుకుంటుందని, బీజేపీకి ఒక సీటు పెరుగుతుందని, కాంగ్రెస్‌ ఒక్క స్థానానికి పడిపోతుందని ఇండియాటుడే సర్వే పేర్కొంది.

రసకందాయంలో బిహార్‌
2019లో ఎన్డీఏ క్లీన్‌స్వీప్‌ చేసిన రాష్ట్రాల్లో బిహార్‌ ముఖ్యమైనది. 40కి ఏకంగా 39 స్థానాలు అధికార కూటమి వశమయ్యాయి. కానీ ఇక్కడ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. తీరా చూస్తే ఆ అంచనాలన్నీ తప్పి జేడీ(ఎస్‌), ఆర్జేడీల మహాఘట్‌బంధన్‌ ఘనవిజయం సాధించింది.

కానీ పల్టూ రామ్‌గా పేరుపడ్డ జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్‌ 2020 అసెంబ్లీ ఎన్నికల నుంచి వేస్తున్న పిల్లిమొగ్గలతో ఓటర్లలో తీవ్ర అయోమయం నెలకొన్నట్టు కన్పిస్తోందని పటా్నకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు రోహిత్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టిన నితీశ్‌ 2022లో దానికి కటీఫ్‌ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమితో స్నేహం చేశారు. తాజాగా గత జనవరిలో మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. దీన్ని జనం జీరి్ణంచుకోలేకపోతున్నారన్నది రోహిత్‌ విశ్లేషణ.

అయితే కుల సమీకణాల కోణంలో బీజేపీ–జేడీ(యూ) భాగస్వామ్యం బలమైన జోడీగా కన్పిస్తుండటం విశేషం. కుర్మీ సామాజికవర్గానికి చెందిన నితీశ్‌కు రాష్ట్రంలో ఏకంగా 36 శాతమున్న అత్యంత వెనకబడ్డ వర్గాల్లో విశేష ఆదరణ ఉంది. పైగా గతేడాది బిహార్లో జరిపించిన కులగణన ఆయనకు మరిన్ని ఓట్లు కురిపించేలా కన్పిస్తోంది. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జేడీ(యూ) జోడీ సూపర్‌హిట్టయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఏకంగా 39 సీట్లు కొల్లగొట్టింది. దీనికి తోడు ఎన్నికల వేళ ఇంటి పోరు ఆర్జేడీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ–నితీశ్‌ జోడీ దూకుడును తేజస్వీ యాదవ్‌ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం.

‘మహా’ గందరగోళం...
48 సీట్లున్న మహారాష్ట్ర యూపీ తర్వాత లోక్‌సభకు అత్యధిక ఎంపీలను పంపుతోంది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. 2019లోనైతే బీజేపీ, శివసేన సంయుక్తంగా ఏకంగా 41 స్థానాలు ఒడిసిపట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రాజకీయాలతో పాటు ఏకంగా పార్టీలే మారిపోయాయి! తర్వాత ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలో శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలో మరో కీలక పార్టీ ఎన్సీపీ నిలువునా చీలిపోయాయి.

చీలిక వర్గాలే అసలైన పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఎన్డీఏలో చేరి బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగాయి. దీన్ని ప్రజలు పెద్దగా జీర్ణించుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఈసారి కాంగ్రెస్, ఉద్ధవ్‌ శివసేన, శరద్‌ పవార్‌ ఎన్సీపీలతో కూడిన విపక్ష ఇండియా కూటమిదే పైచేయి కావచ్చంటున్నారు. సర్వేలు కూడా ఇండియా కూటమి ఏకంగా 26 స్థానాలు గెలుస్తుందంటున్నాయి. అదే నిజమైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 20 సీట్లకు పైగా గండి పడుతుంది!

అదే సమయంలో ఎన్నికల వేళ ఎంఎన్‌ఎస్‌ నేత రాజ్‌ ఠాక్రే మద్దతు ఎన్డీఏకు కాస్త కలిసొచ్చేలా కన్పిస్తోంది. మరాఠా రిజర్వేషన్లది కూడా ఈసారి రాష్ట్రంలో కీలక పాత్ర కానుంది. విద్య, ఉద్యోగాల్లో వారికి అదనంగా 10 శాతం కోటా కలి్పస్తూ శివసేన చీఫ్, సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఇటీవలే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సాంప్రదాయికంగా బీజేపీ ఓటర్లయిన ఇతర వెనకబడ్డ వర్గాలు దీనిపై గుర్రుగా ఉన్నారు. మరాఠా కోటా తమ వాటాకే ఎసరు పెడుతుందన్న భయం వారిలో పెరుగుతోంది. ఇన్ని సమీకరణాల మధ్య మహారాష్ట్రలో ఎవరికెన్ని సీట్లొస్తాయో అంచనా వేయడం కష్టంగా మారింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
Advertisement