Lok sabha elections 2024: రాజకీయ కథాకళి..కేరళ | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: రాజకీయ కథాకళి..కేరళ

Published Thu, Apr 25 2024 3:46 PM

Lok sabha elections 2024: Triangular fight a kerala lok sabha polls - Sakshi

కేరళలో కూటముల కొట్లాటే

ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ హోరాహోరీ

కొన్ని స్థానాల్లో బీజేపీ టఫ్‌ ఫైట్‌

కేరళ రాజకీయాల్లో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ కూటములదే హవా. బీజేపీకి కేడర్‌ ఉన్నా ప్రజాదరణ అంతంతే. దక్షిణాదిలో బీజేపీ ఇంతవరకు ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవని ఏకైక రాష్ట్రం కేరళే. అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ 13 శాతం ఓట్లు సాదించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 11.3 శాతానికే పరిమితమైంది. ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయడమే లక్ష్యంగా కాషాయదళం కష్టపడుతోంది.

క్రిస్టియన్, ముస్లిం ఓటర్లకూ చేరువయ్యేందుకు ప్రయతి్నస్తోంది. ఫలితంగా పలు స్థానాల్లో పోటీ ఇప్పటికే త్రిముఖంగా మారింది. ఇక జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో మాత్రం పరస్పరం తలపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకూ శుక్రవారం రెండో విడతలో ఒకేసారి పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు జరుగుతున్న స్థానాలపై ఫోకస్‌...  

త్రిసూర్‌
రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటు డు సురేశ్‌ గోపి ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా నిలి చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన ఇక్కణ్నుంచే పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి టీఎన్‌ ప్రతాపన్‌ విజయం సాధించారు. అయితే అప్పట్లో ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఆలస్యంగా గోపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి వడకర ఎంపీ కె.మురళీధరన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ సీఎం కె.కరుణాకరన్‌ కుమారుడు.

నాలుగు పర్యా యా లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మురళీధరన్‌కు విన్నింగ్‌ మాస్టర్‌గా పేరుంది. సీపీఐ నుంచి మాజీ మంత్రి వి.ఎస్‌.సునీల్‌ కుమార్‌ పోటీలో ఉన్నారు. 35 శాతమున్న క్రిస్టియన్‌ ఓటర్లు నిర్ణాయకం కానున్నారు. 16 శాతమున్న ముస్లిం ఓట్లూ కీలకమే. ప్రధాని మోదీ ఇప్పటికే త్రిసూర్‌లో రోడ్డు షో జరిపారు. కరువన్నూర్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ స్కాం అధికార ఎల్‌డీఎఫ్‌కు ఇక్కడ ప్రతికూలంగా మారనుందని అంచనా.

పాలక్కాడ్‌
బీజేపీ ఆశలు, ఆకాంక్షలకు పాలక్కాడ్‌ నియోజకవర్గం కీలకం కానుంది. కేరళలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్న ఏకైక మున్సిపాలిటీ ఇది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వీకే శ్రీకందన్‌ ఇక్కడ గెలిచారు. ఈసారి కూడా పార్టీ తరఫున ఆయనే బరిలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి విజయ రాఘవన్‌కు గట్టి పోటీనిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.కృష్ణకుమార్‌ వరుసగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో కృష్ణ కుమార్‌ 21.44 శాతం ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే గత మూడు సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ ఓటు శాతం పెరుగుతూ వస్తోంది.

వయనాడ్‌
ఇది 2009 లోక్‌సభ ఎన్నికల ముందు ఏర్పాటైన నియోజకవర్గం. అప్పటినుంచి ఇక్కడ కాంగ్రెస్‌ హవాయే నడుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎం.ఐ.షానవాజ్‌ గెలిచారు. 2019లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఖాయమని తేలడంతో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వ్యూహాత్మకంగా వయనాడ్‌ నుంచీ బరిలో దిగారు. అమేథీలో ఓడినా ఇక్కడ ఆయన ఏకంగా 4.31 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

ఎన్డీఏ అభ్యరి్థ, బీడీజే (ఎస్‌) నేత తుషార్‌ వెల్లప్పల్లికి 78,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి మాత్రం రాహుల్‌కు ఇక్కడ వార్‌ వన్‌ సైడ్‌ అన్నట్టుగా లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. అన్నీ రాజా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య. ఇక సురేంద్రన్‌ ఉత్తర కేరళలో గట్టి పట్టున్న నాయకుడు. 2019 ఎన్నికల్లో పతనంతిట్టలో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌కు 64.9 శాతం ఓటర్లు రాగా, సీపీఎంకు కేవలం 25.24 శాతం ఓట్లే లభించాయి. ఎన్నికల ముందే ఇక్కడ కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ డీసీసీ జనరల్‌ సెక్రటరీ పీఎం సుధాకరన్‌ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇక్కడ రోడ్‌ షోలు నిర్వహించారు. అమేథీ మాదిరిగానే వయనాడ్‌ నుంచి కూడా రాహుల్‌ పారిపోవడం  ఖాయమంటూ ఎద్దేవా చేశారు.

 అట్టింగల్‌
ఇక్కడ కూడా ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎంపీ అదూర్‌ ప్రకాశ్‌ను కాంగ్రెస్‌ మరోసారి పోటీలో నిలిపింది. బీజేపీ తరఫున కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్‌ పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి వి.జోయ్‌ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అదూర్‌ 2,80,995 ఓట్లతో (38.34 శాతం) గెలిచారు. సీపీఎం అభ్యర్థి అనిరుద్ధ్‌ సంపత్‌కు 34.5 శాతం, బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌కు 24.97 శాతం ఓట్లు లభించాయి. అట్టింగల్‌లో కూడా బీజేపీ ఓటు బ్యాంక్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది.  

పథనంతిట్ట
ఇక్కడ కూడా త్రిముఖ పోటీ వాతావరణమే నెలకొంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం ఏకే ఆంటోనీ కుమారుడైన అనిల్‌ ఆంటోనీని బీజేపీ బరిలో నిలిపింది. సిట్టింగ్‌ ఎంపీ ఆంటో ఆంటోనీకి కాంగ్రెస్‌ మరోసారి అవకాశమిచి్చంది. సీపీఎం తరఫున మాజీ మంత్రి థామస్‌ ఇజాక్‌ పోటీలో ఉన్నారు. తన కుమారుడు ఓడాలని కోరుకుంటున్నానని, ఆంటో ఆంటోనీదే విజయమని ఏకే ఆంటోనీ ప్రకటించడం విశేషం!

శబరిమల ఆలయం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ప్రధాన అభ్యర్థులు ముగ్గురూ కేథలిక్స్‌ క్రైస్తవులే కావడం విశేషం! 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంటో ఆంటోనీ 37.11 శాతం ఓట్లతో సీపీఎం అభ్యర్థి వీణా జార్జ్‌పై 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్‌ 29 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే 2009 ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా 2014లో 16 శాతానికి, 2019లో 29 శాతానికి పెరిగాయి.

కాసర్‌గోడ్‌
సిట్టింగ్‌ ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నితాన్‌ మరోసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి సతీశ్‌ చంద్రన్‌పై ఆయన 1.4 లక్షల మెజారిటీతో గెలిచారు. బీజేపీ ఈ విడత ఎంఎల్‌ అశి్వనికి అవకాశమిచ్చింది. గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం మధ్యే ఉండనుంది. కొద్ది రోజులుగా సీపీఎం అభ్యర్థి ఎం.వి.బాలకృష్ణన్‌ పట్ల స్పష్టమైన మొగ్గు కన్పిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీకి ప్రజామద్దతు పెరుగుతోందని, మోదీ సర్కారుకు ఈసారి రాష్ట్ర ప్రజలు ఓటేస్తారని అశ్విని అంటున్నారు.

     కేరళలో తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో కూడా హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్‌ నుంచి హాట్రిక్‌ వీరుడు శశిథరూర్‌ పోటీలో ఉండగా కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ను బీజేపీ బరిలో దింపింది. ఎల్‌డీఎఫ్‌ సంకీర్ణం తరఫున పి.రవీంద్రన్‌ (సీపీఐ) తలపడుతున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement