Sakshi News home page

ఇవేం పేర్లు బాబోయ్‌!.. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు

Published Fri, Apr 12 2024 5:43 AM

Lok sabha elections 2024: Tricky names for various parties across the country - Sakshi

రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు

దేశవ్యాప్తంగా చాంతాడంత జాబితా 

ట్వంటీ20. హైటెక్‌. సాఫ్‌. సూపర్‌ నేషన్‌. జాగ్తే రహో... ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు! వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలున్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్‌లో ఏకంగా 2,597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికే గమ్మత్తైన, ఆసక్తికరమైన, పేర్లున్న పార్టీలకు కొదవ లేదు. కాకపోతే వీటిలో చాలావరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకే రావు.

పార్టీ పెట్టడం యమా ఈజీ
మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. రూ.10 వేలు డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు... పార్టీ పెట్టేయొచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో గమ్మత్తైన పేర్లకూ కొదవ లేదు.

ఇండియన్‌ లవర్స్‌ పార్టీ, ఇండియన్‌ ఓషియానిక్‌ పార్టీ, లైఫ్‌ పీస్‌ఫుల్‌ పార్టీ, హోలీ బ్లెస్సింగ్‌ పీపుల్స్‌ పార్టీ, లేబర్‌ అండ్‌ జాబ్‌ సీకర్స్‌ పార్టీ, అఖిల భారతీయ భారత్‌మాతా–పుత్రపక్ష, భారతీయ మొహబ్బత్‌ పార్టీ, మినిస్టీరియల్‌ సిస్టం అబాలిషన్‌ పార్టీ, ఆల్‌ పెన్షనర్స్‌ పార్టీ, తమిళ్‌ తెలుగు నేషనల్‌ పార్టీ, ఇండియన్‌ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్‌ పార్టీ, చిల్డ్రన్‌ ఫస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, చాలెంజర్స్‌ పార్టీ, స్వచ్ఛ భారత్‌ పార్టీ, సత్యయుగ్‌ పార్టీ, ఇన్సానియత్‌ పార్టీ, నేషనల్‌ టైగర్‌ పార్టీ, మర్యాదీ దళ్‌... ఇలా ఈ జాబితా చాంతాడును మించిపోతుంది.

ప్రధాని మోదీ ఇటీవల పదేపదే ప్రస్తావిస్తున్న నారీ శక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది! ఆమ్‌ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్‌ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఇక, ద రిలిజియన్‌ ఆఫ్‌ మ్యాన్‌ రివాల్వింగ్‌ పొలిటికల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అనే పార్టీ పేరునైతే వీటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు! అయితే ఈ పార్టీల్లో చాలావరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపమిచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.

రైట్‌ టు రీకాల్‌!
...అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు. భారత్‌లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కుంది. కాకపోతే యూపీలో రాకేశ్‌ సూరి అనే 42 ఏళ్ల కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఈ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్‌ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యమట. అన్నట్టూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఘాజియాబాద్‌ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు! యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలకు కొదవ లేదు. సబ్‌ సే అచ్ఛీ అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్‌ డెమోక్రటిక్‌ పార్టీ. మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట! ఆప్‌ కీ అప్నీ పార్టీ (పీపుల్స్‌), సుభాష్ వాదీ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో ఉన్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement