పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం | Sakshi
Sakshi News home page

పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం

Published Thu, Dec 28 2023 4:38 AM

Low visibility hits many parts of Delhi amid dense fog, trains delayed - Sakshi

న్యూఢిల్లీ/బాగ్‌పట్‌:  ఉత్తర భారతదేశం పొగ మంచు గుప్పిట్లో చిక్కుకుంటోంది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో మూసుకుపోతున్నాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకుతోడు చలి తీవ్ర నానాటికీ పెరుగుతోంది. నగరంలో నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి.

కొన్నింటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంపై ఎయిర్‌ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్‌ లేదా క్యాన్సిల్‌ చేసుకోవచ్చని సూచించింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ  ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో విజిబిలిటీ లెవెల్‌ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్‌ సున్నాకు పడిపోవడం గమనార్హం. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డయిం్యంది. ఇది ‘వెరీ పూర్‌’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది.  

పొగమంచు వల్ల 8 మంది మృతి  
విపరీతమైన పొగమంచు వల్ల దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత, బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మరణించారు. మరో 25 మందికిపైగా గాయాలపాలయ్యారు. బరేలీ జిల్లాలోని హఫీజ్‌గంజ్‌లో మోటార్‌ సైకిల్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు.

Advertisement
Advertisement