ఐశ్వర్యం వస్తుందని.. బాలుడి నరబలి | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యం వస్తుందని.. బాలుడి నరబలి

Published Mon, Oct 3 2022 4:58 AM

Lust for money leads to human sacrifice in Delhi - Sakshi

న్యూఢిల్లీ: మూఢనమ్మకం అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. సంపద వస్తుందనే అంధ విశ్వాసంతో మానవత్వం మరిచి పసివాడిని నరబలి ఇచ్చారు. దేశ రాజధానిలో∙ఈ ఘోరం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన అజయ్‌ కుమార్, అమర్‌ కుమార్‌ దక్షిణ ఢిల్లీ లోధి కాలనీలోని మురికివాడలో ఉంటున్నారు. అక్కడే యూపీకి చెందిన బాధిత బాలుడి కుటుంబం ఉంటోంది. వీరంతా భవన నిర్మాణ కార్మికులు. అజయ్, అమర్‌ శనివారం రాత్రి తమ గుడిసెలో పాటలు పాడుతూ పూజలు మొదలుపెట్టారు.

అది చూసేందుకు బాలుడు  వెళ్లాడు. పూజలు ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ, తన కుమారుడు ఎంతకీ రాకపోయేసరికి వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి రక్తం చారికలుగా ప్రవహిస్తూ కనిపించింది. లోపల మంచం కింద తన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు వస్తుందనే మూఢ నమ్మకంతోనే తమ వద్దకు వచ్చిన బాలుడి తలపై మోది, చాకుతో గొంతుకోసి చంపినట్లు అజయ్, అమర్‌ పోలీసుల విచారణలో వెల్లడించారు.

Advertisement
Advertisement